ఒరిస్సాలోని అనేక ప్రాంతాలలో భారీగా బంగారం నిల్వలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో ఆ రాష్ట్రం బంగారం తవ్వకాలకు కేంద్రంగా మారింది. దీని కారణంగా మన దేశంలో ఆ లోహం ధరలు తగ్గుతాయని, సామాన్యులకు అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి అవకాశమని అభిప్రాయపడుతున్నారు.
ఒరిస్సాలోని సుందర్ గఢ్, నబరంగ్ పూర్, కియోంఝర్, డియోగఢ్ జిల్లాలలో పసిడి నిక్షేపాలను గుర్తించారు. బౌధ్, మల్కాన్ గిరి, సంబల్ పూర్ జిల్లాలలో కూడా అన్వేషణ కొనసాగుతోంది. వీటిలో పాటు మారేదిహి, సులేపట్, బాదంపహాడ్ తదితర ప్రాంతాలలో ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి.
ఒరిస్సాలోని దేవ్ ఘర్ జిల్లాలో జరిగిన భౌగోళిక సర్వేలో బంగారు నిక్షేపాలను కనుగొన్నారు. గతంలో గుర్తించిన అడసా – రాంపల్లి నిల్వల కంటే ఇవి భారీగా ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో పాటు ఈ ప్రాంతంలో రాగి కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అన్వేషిస్తోంది. ఒడిశా ప్రభుత్వం, జీఎస్ఐ, మైనింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. కియోంఘర్ జిల్లాలోని గోపూర్ – ఘాజీపూర్, మంకడ్చువాన్, సలేకానా, దిమిరిముండా ప్రాంతాల్లో ప్రయత్నాలు ఆ రాష్ట్ర మైనింగ్ రంగం ప్రగతికి ఉపయోగపడతాయి. ఇక్కడ లభించే బంగారం నిల్వలను సమర్థంగా వినియోగించుకోవాలని ఒడిశా ప్రభుత్వం యోచిస్తోంది.
దేవ్ ఘర్ జిల్లాలో మొట్టమొదటి బంగారు మైనింగ్ బ్లాక్ వేలం నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది ఆ రాష్ట్ర మైనింగ్ పరిశ్రమ ప్రగతిలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. బంగారు గనులతో ఆ రాష్ట్రానికి, దేశానికి కూడా గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
బంగారు ఆభరణాలు అంటే కేవలం అందం కోసం ధరించడానికి మాత్రమే కాదు. అత్యవసర సమయంలో ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తాయి. వీటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలను తీసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ప్రజలందరూ ఆసక్తి చూపుతున్నారు. కొన్ని కారణాల వల్ల డబ్బు విలువ హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ, బంగారం విలువ మాత్రం స్థిరంగా పెరుగుతూనే ఉంటుంది. ఆర్థిక అస్థిరత కాలంలో ప్రజలకు బంగారం భరోసా కల్పిస్తుంది.