సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) 2016-17 సిరీస్ IV లో పెట్టుబడిదారులు భారీ లాభాలను ఆర్జించారు. మార్చి 2017లో ఈ బాండ్ జారీ సమయంలో గ్రాముకు రూ. 2,943 చొప్పున కొనుగోలు చేసిన బంగారం.. ఇప్పుడు గ్రాముకు రూ. 8,624కి చేరుకుంది. అంటే ఈ పెట్టుబడిదారులు 3 రెట్లు ఎక్కువ రాబడిని పొందారు. ఇది 193% భారీ పెరుగుదలను చూపుతుంది.
2016-17 సిరీస్ IV బాండ్లకు సంబంధించిన రిడెంప్షన్ తేదీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ప్రకటించింది. మార్చి 17ను మెచ్యూర్ తేదీగా నిర్ణయించింది. దీంతో అప్పట్లో పెట్టుబడులు చేసిన వారు దాదాపు మూడింతలు లాభం పొందనున్నారు. ఇదిలా ఉండగా, దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో 2015 నవంబర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి కాలపరిమితి 8 సంవత్సరాలు. 2017లో మార్చిలో జారీ చేసిన నాలుగో విడత బాండ్లకు మెచ్యూరిటీ ధరను తాజాగా ఆర్‌బీఐ ప్రకటించింది. అప్పట్లో గ్రాము రూ.2,943 చొప్పున బాండ్లు జారీ చేయగా.. తాజా ధరను రూ.8624గా పేర్కొంది. అంటే అప్పట్లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు దాదాపు రూ.3 లక్షలు లాభం రానుంది.
SGB ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుంది?
సావరిన్ గోల్డ్ బాండ్లు అనేవి భారత ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా జారీ చేసే ప్రభుత్వ బాండ్లు. వీటిని గ్రాము ప్రాతిపదికన కొనుగోలు చేస్తారు. మెచ్యూరిటీ తర్వాత వీటిని నగదు రూపంలో రీడీమ్ చేస్తారు. సావరిన్ గ్యారెంటీ ఉంటుంది. అందుకే పెట్టుబడిదారులు ఎలాంటి డిఫాల్ట్ ప్రమాదంలో ఉండరు.
సావరిన్ గోల్డ్ బాండ్‌లను మెచ్యూరిటీకి ముందు సెకండరీ మార్కెట్లో విక్రయిస్తే, వాటి హోల్డింగ్ వ్యవధిని బట్టి మూలధన లాభాల పన్ను విధిస్తారు. ఇటీవలి నిబంధనల ప్రకారం.. 12 నెలల కంటే ఎక్కువ కాలం పాటు ఉంచుకుంటే మూలధన లాభాలపై దీర్ఘకాలిక పన్ను విధించబడుతుంది. ఎటువంటి ఇండెక్సేషన్ ప్రయోజనాలు లేకుండా 12.5 శాతం పన్ను విధిస్తారు. లేకపోతే వాటికి స్లాబ్ రేట్ల వద్ద స్వల్పకాలిక మూలధన లాభాలుగా పన్ను విధిస్తారని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Credit Card: ఈ ఐదుగురు పొరపాటున కూడా క్రెడిట్ కార్డ్ తీసుకోకూడదు.. అప్పులే కాదు సిబిల్ స్కోర్ గోవిందా!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి