Gold: దుబాయ్‌ బంగారం తెస్తే ఎందుకు పట్టుకుంటారు.. లీగల్‌గా ఎంత తెచ్చుకోవచ్చు?

Written by RAJU

Published on:

నటి రన్యారావు ఎపిసోడ్‌ తర్వాత అందరి ఫోకస్‌ దుబాయ్‌ గోల్డ్‌పై పడింది. నిబంధనలకు విరుద్ధంగా సుమారు 14 కేజీల అక్రమ బంగారంతో రన్యారావు పట్టుబడడం సంచలనం రేపింది. అయితే.. ఈ ఘటన తర్వాత దుబాయ్‌ నుంచి బంగారం తెచ్చుకుంటే ఎందుకు పట్టుకుంటున్నారు?.. దుబాయ్‌ గోల్డ్‌కు ఎందుకంత క్రేజ్‌?.. అసలు.. దుబాయ్‌ నుంచి మనం ఎంత బంగారం తెచ్చుకోవచ్చు?.. దుబాయ్‌ బంగారానికి భారత్‌లో ఉన్న టాక్స్‌ లెక్కలేంటి? తెలుసుకుందాం..!

కన్నడ నటి రన్యారావు ఘటనతో అందరూ దుబాయ్‌ బంగారం స్పెషల్‌ ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నటి రన్యారావే కాదు.. సాధారణంగా దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారాన్ని ఎవరు తీసుకొచ్చినా ఎయిర్‌పోర్ట్‌లలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకుంటారు. ఇలాంటి ఘటనలు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌లలో కామన్‌గా ప్రతిరోజు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అయితే.. ఈసారి ఓ సెలబ్రిటీ భారీగా అక్రమ బంగారంతో పట్టుబడడం సంచలనంగా మారింది. ఫలితంగా దుబాయ్‌ నుంచి బంగారాన్ని ఎందుకు ఎక్కువగా తరలిస్తుంటారు..? అక్కడి నుంచి బంగారం తీసుకొస్తే ఎందుకు పట్టుకుంటారు? అసలు.. దుబాయ్‌ నుంచి లీగల్‌గా ఎంత బంగారాన్ని తెచ్చుకోవచ్చు? అనే అంశాలు హాట్‌టాపిక్‌ అవుతున్నాయి.

వాస్తవానికి.. మన దేశంతో పోల్చితే దుబాయ్‌లో బంగారం ధర చాలా తక్కువగా ఉంటుంది. పైగా దుబాయిలో బంగారం కొనుగోళ్లపై ఎలాంటి టాక్స్‌లు ఉండవు. మన దేశంలోని బంగారం ధరకు, దుబాయ్‌ నుంచి తెచ్చుకున్న బంగారం ధరకు సుమారు 7, 8వేల రూపాయల వరకు రేటు తేడా ఉంటుంది. అందుకే.. దుబాయ్‌ నుంచి బంగారం తెచ్చుకునేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. అయితే.. అక్కడి నుంచి బంగారం తీసుకొచ్చేందుకు కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ రూల్స్‌ తప్పకుండా పాటించాలి. భారత్‌కు బంగారం తీసుకురావాలంటే ముందుగా దిగుమతి సుంకం చెల్లించాలి. ప్రస్తుతం ఈ పన్ను 6 శాతం ఉండగా.. దీనిని కట్టకుండా ఎగ్గొట్టేందుకే దుబాయ్‌ నుంచి భారత్‌కు చాలామంది అక్రమంగా బంగారం తీసుకొస్తూ ఎయిర్‌పోర్టుల్లో పట్టుపడుతుంటారు.

ఇక.. ఇలా పట్టుబడకుండా.. కస్టమ్స్‌ రూల్స్‌ ప్రకారం దుబాయ్‌ నుంచి మనం ఎంత బంగారం తీసుకురావచ్చు? అనే దానిపై ఓ లుక్కేద్దాం.. 1967 పాస్‌పోర్ట్ చట్టం ప్రకారం.. ఆరు నెలలకు పైగా దుబాయ్‌లో ఉన్న ఇండియన్స్‌ ఎవరైనా ట్యాక్స్‌లు చెల్లించి కిలో వరకు బంగారాన్ని తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. టాక్స్‌ లేకుండా పురుషులు 50వేల రూపాయలకు మించకుండా 20 గ్రాములు, మహిళలు లక్ష రూపాయలకు మించకుండా 40 గ్రాముల వరకు బంగారం తెచ్చుకునేందుకు పర్మిషన్‌ ఉంది. అలాగే, 15 ఏళ్లలోపు పిల్లలయితే.. 40గ్రాముల వరకు తెచ్చుకోవచ్చు. ఆయా రూల్స్‌తోపాటు.. బంగారం కొనుగోలుకు సంబంధించిన పత్రాలు కస్టమ్స్‌ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.

ఇదిలావుంటే.. రూల్స్‌కు మించి బంగారం తెచ్చుకోవాలనుకుంటే ఎలాంటి సుంకాలు చెల్లించాలి? అనేది ఇప్పుడు చూద్దాం.. 1967 పాస్‌పోర్ట్ చట్టం ప్రకారం ట్యాక్స్‌లు చెల్లించి దుబాయ్ నుంచి మనం ఎంత బంగారాన్ని అయినా తెచ్చుకునేందుకు అనుమతి ఉంది.

పురుషులకు..

20 నుంచి 50గ్రాముల బంగారానికి 3శాతం కస్టమ్స్‌ డ్యూటీ

50 నుంచి 100గ్రాముల బంగారానికి 6శాతం కస్టమ్స్‌ డ్యూటీ

100గ్రాముల కంటే ఎక్కువ బంగారంపై 10శాతం సుంకం చెల్లించాలి.

మహిళలు, పిల్లలకు..

40 నుంచి 100 గ్రాముల బంగారానికి 3శాతం సుంకం

100నుంచి 200 గ్రాముల బంగారానికి 6శాతం సుంకం

200గ్రాముల కంటే ఎక్కువ బంగారంపై 10శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది.

మొత్తంగా.. దేశంలోని కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ రూల్స్‌కు అనుగుణంగా బంగారం తెచ్చుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ.. అత్యాశకు పోయి అక్రమ మార్గంలో బంగారం తెచ్చుకోవాలనుకుంటే మాత్రం అడ్డంగా బుక్కవ్వాల్సిందే..! ఈ నిబంధనలు తెలియకుండా కూడా కొందరు అమాయకులు బంగారం తీసుకొచ్చి కస్టమ్ అధికారులకు దొరికిపోతుంటారు. సో.. ఇండియన్‌ కస్టమ్స్‌ రూల్స్‌ ఫాలో అవ్వండి.. దుబాయ్‌ నుంచి ఎంత బంగారం అయినా తెచ్చుకోండి..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Subscribe for notification