- ఔరంగజేబు వివాదం నేపథ్యంలో సీఎం యోగి వార్నింగ్..
- ఆక్రమణదారుల్ని కీర్తించడం దేశద్రోహమే అని కామెంట్స్..

Yogi Adiyanath: దేశవ్యాప్తంగా ఔరంగజేబు సమాధి అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం నాగ్‌పూర్‌లో అల్లర్లకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణదారులను కీర్తించే వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇది కొత్త భారతదేశమని, ఆక్రమణదారుల్ని కీర్తించడం దేశద్రోహ చర్య అని అన్నారు. ఔరంగజేబు పేరుని నేరుగా ప్రస్తావించకుండా.. మన నాగరికత, సంస్కృతి, మహిళలపై దాడి చేసి, మన విశ్వాసంపై దాడి చేసిన వ్యక్తులను కీర్తించడంపై యోగి హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: Digital Arrest: 80 ఏళ్ల వృద్ధురాలు ‘‘డిజిటల్ అరెస్ట్’’.. రూ. 20 కోట్లు కొట్టేసిన మోసగాళ్లు..
‘‘ఆక్రమణదారులను కీర్తించడం అంటే దేశద్రోహం యొక్క మూలాలను బలోపేతం చేయడం. మన గొప్ప పూర్వీకులను అవమానించే వారిని మరియు మన నాగరికతపై దాడి చేసిన, మన మహిళలను ఉల్లంఘించిన, మన విశ్వాసంపై దాడి చేసిన వారిని ప్రశంసించే వారిని న్యూ ఇండియా ఎప్పటికీ అంగీకరించదు’’ అని బహ్రైచ్‌లో జరిగిన బహిరంగ సభలో యోగి అన్నారు. ప్రపంచం మొత్తం భారత గొప్ప వారసత్వాన్ని గుర్తిస్తున్నప్పుడు, మన గొప్ప నాయకులను గౌరవించడం ప్రతీ పౌరుడి విధి, మన గుర్తింపుని తుడిచిపెట్టడానికి ప్రయత్నించిన వారిని ప్రశంసించడం కాదు అని ఆయన అన్నారు.
శంభాజీ నగర్ జిల్లాలోని ఔరంగజేబు సమాధిని కూల్చివేడానికి వీహెచ్‌పీ ఇటీవల డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలో ఆందోళన నిర్వహించింది. గురుగోవింద్ సింగ్ ఇద్దరు కుమారులను చంపడం, కాశీ, మధుర, సోమనాథ్ ఆలయాలను ధ్వంసం చేయడం వంటి దురాగతాలకు ఔరంగజేబు పాల్పడినట్లు ఆరోపించింది. మరాఠా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఇటీవల ‘‘ఛావా’’ సినిమా వచ్చింది. ఈ సినిమా తర్వాత మహారాష్ట్ర వ్యాప్తంగా భావోద్వేగాలు బలపడ్డాయి. దీంతో శంభాజీని హింసించిన ఔరంగజేబు సమాధి మరాఠా గడ్డపై ఉండొద్దని పలువురు డిమాండ్ చేస్తున్నారు.