భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు ‘ఐసిస్ కాశ్మీర్’ నుండి హత్య బెదిరింపులు రావడం ఇటు క్రికెట్ పరంగా అటు దేశ భద్రత పరంగా కలకలం రేపింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో, గంభీర్‌కు ఈ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. “నేను నిన్ను చంపేస్తాను” అనే వ్యాఖ్యలతో కూడిన ఈ-మెయిల్‌ను గంభీర్‌కు పంపారని ఇండియా టుడే నివేదించింది. మంగళవారం ఉగ్రదాడి జరిగిన తర్వాత బుధవారం ఉదయం గంభీర్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించి తన కుటుంబానికి పూర్తి భద్రత కల్పించాలని అధికారిక ఫిర్యాదు చేశారు. మాజీ బీజేపీ ఎంపీ అయిన గంభీర్ ప్రస్తుతం టీం ఇండియా ప్రధాన కోచ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి గంభీర్ తీవ్రంగా స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతా X (ట్విట్టర్) ద్వారా “మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను అని దీనికి బాధ్యులు అయిన వారు మూల్యం చెల్లించుకుంటారు అని భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది అని వ్యాఖ్యానించారు.
గంభీర్ ఇటీవలే తన కుటుంబంతో సెలవుల కోసం ఫ్రాన్స్ వెళ్లి, ఈ నెల ప్రారంభంలోనే దేశానికి తిరిగి వచ్చారు. ఐపీఎల్ 2025 జరుగుతున్న ఈ సమయంలో ప్రధాన కోచ్‌లకు విశ్రాంతి సమయం లభించే అవకాశం ఉండగా, గంభీర్ ఈ ఫేజ్‌ను వ్యక్తిగత విశ్రాంతికి ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం జూలైలో టీం ఇండియా ప్రధాన కోచ్‌గా నియమితుడైన గంభీర్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేశారు. కోచ్‌గా తన ప్రయాణంలో కొన్ని కఠినమైన దశలను కూడా గంభీర్ ఎదుర్కొన్నారు. శ్రీలంకతో వన్డే సిరీస్, న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లలో భారత్ ఓటమిని చవిచూడగా, ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కూడా గంభీర్ నాయకత్వంలో భారత్ కోల్పోయింది. డ్రెస్సింగ్ రూమ్ చర్చలు మీడియాకు లీక్ కావడం, భారత జట్టులో భిన్నాభిప్రాయాలు తెరపైకి రావడం వంటి సంఘటనలు గంభీర్‌పై విమర్శలు పెంచాయి.
అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయం గంభీర్‌కు మళ్లీ విశ్వాసాన్ని తీసుకొచ్చింది. టీం ఇండియా ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి అజేయంగా టైటిల్ గెలుచుకుంది. తొమ్మిదో నెలల వ్యవధిలో ఇది భారత్‌కు రెండో ICC ట్రోఫీ కావడం విశేషం. ఈ విజయంతో పాటు గంభీర్ క్రికెట్లో తన తిరుగులేని కృషిని చూపించగలిగారు. అయితే ఇప్పుడు వచ్చిన హత్య బెదిరింపులు ఆయనకు, భారత క్రికెట్ బోర్డుకి సవాల్‌లాంటివే. భారత క్రికెట్ ప్రధాన కోచ్‌గా ఉన్న వ్యక్తికి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు రావడం, దేశ భద్రత వ్యవస్థను అప్రమత్తం చేస్తోంది. పోలీసులు ఇప్పటికే ఈ కేసును పరిశీలించేందుకు చర్యలు ప్రారంభించగా, గంభీర్ కుటుంబానికి భద్రతను పెంచారు.
Praying for the families of the deceased. Those responsible for this will pay. India will strike. #Pahalgam
— Gautam Gambhir (@GautamGambhir) April 22, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..