ABN
, Publish Date – Apr 03 , 2025 | 04:21 PM
కంచ గచ్చిబౌలి భూములపై ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది. భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొదంటూ ఆదేశించింది.

Supreme Court
ఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (కంచ గచ్చిబౌలి) భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొదంటూ స్టే విధించింది. విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై జస్టిస్ గవాయ్ ధర్మాసనం సీరియస్ అయ్యింది. మూడ్రోజుల్లో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని ధర్మాసనం పేర్కొంది. దీన్ని చాలా సీరియస్ అంశంగా పరిగణించింది.
చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని జస్టిస్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని మండిపడింది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికను ఉన్నత న్యాయస్థానం పరిశీలించింది. అలాగే మీడియా, పత్రికల్లో వచ్చిన కథనాలను సైతం జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందు అమికస్ క్యూరీ పరమేశ్వర్ ఉంచగా.. వాటినీ పరిశీలించింది. కాగా, తదుపరి విచారణను ఈనెల 16కి వాయిదా వేస్తూ అప్పటివరకూ భూముల్లో ఎలాంటి పనులూ చేపట్టవద్దని ఆదేశించింది.
Updated Date – Apr 03 , 2025 | 04:42 PM