వాస్తవానికి టోల్ ప్లాజాల వ్యవస్థ స్థానంలో కొత్త వ్యవస్థ జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్ల విధానం(జీఎన్ఎస్ఎస్)ను తీసుకొస్తున్నట్లు కొంతకాలం కిందట కేంద్రం ప్రకటించింది. అది కూడా మే ఒకటో తేదీని నుంచి అమలు అన్నట్లు ప్రచారం జరిగింది. ఇకపై టోల్ ప్లాజాలు పనిచేయవన్నట్లు పలు వార్తాకథనాలు కూడా ప్రచారం అయ్యాయి. అయితే అవేమీ వాస్తవాలు కాదని టోల్ గేట్లు అలానే కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇంకా నిర్ణయం తీసుకోలేదు..
మే 1, 2025 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థను నిలిపివేస్తున్నట్లు వస్తున్న పుకార్లను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఇటీవల విడుదల చేసిన అధికారిక ప్రకటనలో దీనికి సంబంధించిన వివరాలు పేర్కొంది. ఫాస్ట్ ట్యాగ్ తొలగిస్తున్నట్లు సూచించే, తప్పుదారి పట్టించే నివేదికలు, వైరల్ సందేశాలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది. దేశవ్యాప్తంగా టోల్ చెల్లింపులకు ఈ వ్యవస్థ కొనసాగుతుందని చెప్పింది. కొత్త సాంకేతిక విధానాలు పరిశీలనలో ఉన్నప్పటికీ, ఎంపిక చేసిన టోల్ ప్లాజాలలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) వ్యవస్థను పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని పేర్కొంది. ఇది ఫాస్టాగ్ ను మరింత బలోపేతానికి చేయడానికి ఉపకరిస్తుందని స్పష్టం చేసింది.
హైబ్రిడ్ టోలింగ్ మోడల్ ఇది..
ప్రతిపాదిత హైబ్రిడ్ మోడల్ ప్రస్తుత రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) ఆధారిత ఫాస్టాగ్ ను ఏఎన్పీఆర్ టెక్నాలజీతో కలపడానికి ప్రయత్నిస్తుంది. ఈ వినూత్న విధానం అవరోధం లేని టోల్ సేకరణను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అధునాతన హై-రిజల్యూషన్ కెమెరాలు వాహన నంబర్ ప్లేట్‌లను సంగ్రహించి, మరింత సమర్థవంతమైన టోల్ చెల్లింపు ప్రక్రియ కోసం వాటిని ఫాస్టాగ్ ఖాతాలతో లింక్ చేస్తాయి. వీటి ద్వారా టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడమే లక్ష్యం. అలాగే టోల్ గుండా వాహనాలు వేగంగా వెళ్లడానికి ఉపకరిస్తుంది. వాహనదారులకు సున్నితమైన, అంతరాయం లేని టోలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అయితే, హైబ్రిడ్ మోడల్ ఇంకా పైలట్ దశలోనే ఉందని, దేశవ్యాప్తంగా దాని అమలుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
ఇవి కూడా చదవండి
ఫాస్టాగ్ కట్టాల్సిందే..
ఫాస్టాగ్ లేదని ఎవరూ భావించవద్దని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. టోల్ చెల్లింపు విధానాలను నిర్లక్ష్యం చేసే వాహన యజమానులు ఎలక్ట్రానిక్ నోటీసులు అందుకోవచ్చని పేర్కొంది. వారి ఫాస్టాగ్ ఖాతాలను సస్పెండ్ చేయవచ్చు లేదా వాహన్(VAHAN) వాహన రిజిస్ట్రేషన్ డేటాబేస్ ప్రకారం జరిమానాలు విధించవచ్చని హెచ్చరించింది. ఫాస్ట్ ట్యాగ్ నిలిపివేతకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వాహనదారులు విస్మరించాలని కోరింది. టోలింగ్ వ్యవస్థలో ఏవైనా మార్పులపై అధికారిక నవీకరణలు విశ్వసనీయ ఛానెల్‌ల ద్వారా అందిస్తామని వివరించింది. www.nhai.gov.in, morth.nic.in వంటి అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించడం ద్వారా ప్రజలకు సమాచారం అందుతుందని పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి