Fast food: మీరు ఫాస్ట్‌ఫుడ్‌ తింటున్నారా.. అయితే ఒక్కక్షణం..

Written by RAJU

Published on:

– ఫాస్ట్‌ఫుడ్‌తో.. యూరిన్‌ ఇన్‌ఫెక్షన్లు

– యువతలో యూరినరీ ప్రొటీన్‌ లీక్‌

– జిమ్‌కు వెళ్లే వారిలో క్రియాటినైన్‌ అవస్థ

– నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలపై ప్రభావం

– ఏఐఎన్‌యూ వైద్యుల పరిశీలనలో వెల్లడి

ఫాస్ట్‌ఫుడ్‌ తిండి, మానసిక ఒత్తిళ్ల ప్రభావం విద్యార్థులు, యువతలో మూత్రనాళాల ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తోంది. జిమ్‌కు వెళ్లే వారిలో కొందరికి సీరం క్రియోటినైన్‌ స్థాయిని పెంచుతుండగా, మరికొందరికి మూత్రంలో ప్రొటీన్లు(Proteins) బయటకు వెళుతున్నాయి. ఈ తరహా సమస్యలతో నాలుగు శాతం మేర బాధితులు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ప్రి వంద మంది అవుట్‌ పేషెంట్‌ విభాగంలో ముగ్గురు నలుగురు ఈ సమస్యలతో వస్తున్నారని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలపై వాటి ప్రభావం పడుతుందని, క్రమంగా ఆరోగ్యం క్షీణించి ఇది ప్రాణాలకు ముప్పుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Special trains: 16, 17 తేదీల్లో చర్లపల్లి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌ సిటీ: నగరంలో పలువురు జంక్‌ఫుడ్‌(Junk food)లకు అలవాటు పడుతుండడం అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు చదువు ఒత్తిడిలో నీటిని సరైన మోతాదులో తీసుకోకపోవడం వల్ల కూడా అనారోగ్యం పాలవుతున్నారు. ఫలితంగా వారిలో యూరిన్‌ ఇన్ఫెక్షన్లు, కిడ్నీల్లో రాళ్లలాంటి సమస్యలు బయటపడుతునాయి. గడిచిన రెండేళ్లలో 72 నుంచి 96 మంది బాధితులకు చికిత్సలు అందించినట్లు నెఫ్రాలజిస్టు డాక్టర్‌ ఆవుల నవీన్‌రెడ్డి తెలిపారు.

జిమ్‌కు వెళ్లే వారిలో క్రియాటినైన్‌

16 నుంచి 20 ఏళ్ల వారిలో చాలావరకు సమస్యలు ప్రారంభ దశలోనే ఉంటున్నాయి. జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం, మితంగా నీటిని తాగడం వంటివి చేస్తుండడంతో యూరినరీ సమస్యలు వస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు. నెఫ్రాలజిస్టుల వద్దకు ఎక్కువగా యూరిన్‌ ఇన్ఫెక్షన్లు, క్రియాటినైన్‌ పెరగడం, ప్రొటీన్స్‌ లీకేజీ కావడం వంటి సమస్యలతోనే వస్తున్నారని తెలిపారు. జిమ్‌కు వెళ్లే వారిలో ఎక్కువమందికి ఈ సమస్యలు చూస్తున్నట్లు చెబుతున్నారు. చాలావరకు విద్యాసంస్థల్లో మూత్రశాలలు తక్కువ సంఖ్యలో ఉంటుండడం, దాంతో విద్యార్థులు యూరిన్‌ వెళ్లడం తగ్గించేందుకు నీళ్లు తాగడం మానేస్తున్నారు. ఇవే యూరిన్‌ ఇన్ఫెక్షన్లు, కిడ్నీల్లో రాళ్లు రావడానికి కారణంగా మారుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.

city2.2.jpg

కిడ్నీ బయాప్సీతో నిర్ధారణ

కిడ్నీ బయాప్సీ పరీక్ష ద్వారా క్రియాటినైన్‌ పెరిగింది, ప్రొటీన్‌ లీకేజీ అవుతున్నది నిర్ధారించవచ్చు. ఒకవేళ ప్రొటీన్‌ లీకేజీ లేకపోతే వైద్యులు సూచించే ముందస్తు జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. జాగ్రత్తలు తీసుకున్నా క్రియాటినైన్‌ పెరిగితే అదనపు పరీక్షలు చేసి వైద్యుల ద్వారా తగిన చికిత్సను తీసుకోవాలి.

జాగ్రత్తలు ఇవీ..

– బాధితులు ప్రొటీన్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

– నొప్పి నివారణ మందులు వాడకూడదు

– నీళ్లు తగినంతగా తాగాలి, మాంసాహారం తగ్గించాలి

– తగినంత వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారం తీసుకోవాలి

– ప్రొటీన్‌ మందుల వాడకం బాగా తగ్గించాలి.

ఇన్‌ఫెక్షన్లను ఇలా గుర్తించాలి

మూత్రవిసర్జనకు వెళ్లినప్పుడు అందులో నురగ లాంటిది ఎక్కువగా వస్తే.. అప్పుడు ప్రొటీన్‌ లీకేజీ ఉన్నట్లు అనుమానించాలి. జ్వరం, పొట్టనొప్పి రావడం, తరచూ మూత్రానికి వెళ్లడం, మూత్రం పోసేటప్పుడు మంట పుట్టడం లాంటి లక్షణాలు యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ సూచికలు. మూత్రంలో రక్తం చారికలు కనపడితే కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లుగా అనుమానించాలి. కిడ్నీ సమస్యలు మరింత తీవ్రతరం కాకముందే వాటిని గుర్తించాలి.

-డాక్టర్‌ ఆవుల నవీన్‌ రెడ్డి,

నెఫ్రాలజిస్టు, ఏఐఎన్‌యూ

ఈ వార్తలు కూడా చదవండి:

Arjun Reddy: గ్రూప్‌-3 టాపర్లూ పురుషులే..

నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్‌ భూములు కావు

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై.. తుది దశకు సాధ్యాసాధ్యాల అధ్యయనం

మా సిఫారసు లేఖలు తీసుకోవాలి

Read Latest Telangana News and National News

Subscribe for notification