100 శాతం సిలబస్‌తో ప్రశ్నాపత్రాలు
ఉదయం 9 గంటల నుంచి.. మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష
ఫిబ్రవరి 15 నుంచి ప్రాక్టికల్స్
షెడ్యూల్‌ను ప్రకటించిన ఇంటర్ బోర్డు
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మార్చి 15వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు (Intermediate Annual Examinations) ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం ఇంటర్ బోర్డు (Inter Board) ప్రకటించింది. సుమారు 20 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు మార్చి 29వ తేదీతో ముగియనుండగా, బ్రిడ్జి/మోడరన్ ల్యాంగ్వేజి/జాగ్రఫీ వంటి పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీతో పూర్తి కానున్నాయి. ఈ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచి 100 శాతం సిలబస్‌ను అమలుపరుస్తున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో సిలబస్‌ను 70శాతానికి కుదించి, పరీక్షలను కూడా ఆ మేరకే నిర్వహించారు. అయితే.. ఈ ఏడాది విద్యాసంవత్సరాన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 100 శాతం సిలబస్‌ను అమలు పరుస్తున్నారు. వార్షిక పరీక్షలను కూడా వంద శాతం సిలబస్‌తోనే నిర్వహించనున్నారు. అలాగే.. కరోనా సమయంలో చాయిస్ ప్రశ్నల సంఖ్యను పెంచారు. దాంతో ఇప్పుడు ఆ చాయిస్ ప్రశ్నల సంఖ్యను పూర్వపు స్థితికి తీసుకొచ్చారు. అంటే.. కరోనా కంటే ముందు ఉన్న పద్ధతి ప్రకారం ప్రస్తుతం పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు.
కాగా, రాష్ట్రంలో ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. 15వ తేదీ నుంచి మొదలయ్యే ఈ పరీక్షలు మార్చి 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ పరీక్షలన్నీ రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌ను ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండవ సెషన్ పరీక్షలను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. అలాగే మార్చి 4వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 1 గంటల వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూ పరీక్షలను నిర్వహించనున్నారు. ఎన్విరాన్‌మెంటల్ విద్య పరీక్షలను మార్చి 6వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహిస్తారు.
ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ పరీక్షల ప్రారంభం!
సాంకేతికంగా ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉన్నా.. ప్రధాన పరీక్షలు మాత్రం మార్చి 29వ తేదీతోనే ముగియనున్నాయి. దాంతో ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ పరీక్షలు(Tenth Exams) నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. సాధారణంగా టెన్త్‌లో 11 పేపర్లు ఉంటాయి. అయితే.. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ సారి పరీక్ష పేపర్ల సంఖ్యను 6కు కుదించారు.