విద్యార్థుల మొబైల్ ఫోన్లకూ ఫలితాల లింక్
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనున్నారు. దీంతోపాటు ఈసారి ప్రతీ విద్యార్థి మొబైల్ ఫోన్‌కు కూడా ఫలితాల లింక్ పంపనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. లింక్‌పై క్లిక్ చేసి హాల్ టికెట్ వివరాలు నమోదు చేసి ఫలితాలు పొందవచ్చునన్నారు. గతంలో ఫలితాల సమయంలో సర్వర్ డౌన్ లాంటి సమస్యలు ఎదురైన అనుభవాల నేపథ్యంలో.. ఈసారి అలాంటి సాంకేతిక సమస్యలు ఎదురవకుండా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ప్రత్యేక చర్యలు తీసుకుంది.
ఫలితాల నేపథ్యంలో ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం విద్యార్థుల మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్) పంపారు. ‘పరీక్షల్లో జయాపజయాలు సహజం. ఫెయిలయ్యారనో, ఆశించిన విధంగా మార్కులు రాలేదనో నిరుత్సాహ పడవద్దు. మరింత శ్రమించండి.. రెట్టింపు పట్టుదలతో పోరాడండి. విజయం మీ బానిస అవుతుంది’’ అంటూ స్ఫూర్తిదాయక సందేశాన్ని పంపారు. ప్రతి విద్యార్థికీ ప్రత్యేక నైపుణ్యం ఉంటుందని, వారి ప్రతిభను కేవలం మార్కుల ఆధారంగా అంచనా వేయలేమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తులను గుర్తించి ప్రోత్సహించాలని, వారికి అండగా నిలబడాలని సూచించారు. ఫలితాల అనంతరం మానసిక ఆందోళనతో ఉన్న విద్యార్థులు టెలీమానస్ టోల్‌ఫ్రీ నంబర్ 1800 891 4416 కు కాల్ చేయవచ్చని అన్నారు. కాగా, మార్చి 5-25 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి…
CM Revanth Reddy: ఆ అధికారిని రిటైరయ్యాక కొనసాగించండి
BRS MLC Kavitha: పేరుకే ముగ్గురు మంత్రులు అభివృద్ధి శూన్యం
Cybercrime: సైబర్ నేరగాళ్లకు కమీషన్‌పై ఖాతాల అందజేత
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News