ఈ మధ్య కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో తరచుగా లిఫ్ట్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో నాలుగు వారాల్లో ఏకంగా నాలుగు ప్రమాదాలు జరిగాయి. తాజాగా, ఖమ్మం నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి లిప్ట్ జారి కిందపడింది. ఈ ప్రమాదంలో సరోజనమ్మ అనే మహిళ చనిపోయింది. మనిషి శ్రమను తగ్గించే లిఫ్ట్‌ల కారణంగా లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని సార్లు భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం వల్ల, నాసిరకం లిఫ్ట్‌లు వాడటం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సాధారణంగా లిఫ్ట్ డోర్ల కారణంగా తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ, ఈ మధ్య కాలంలో ఏకంగా లిఫ్ట్‌లు ఊడి కిందపడిపోతున్నాయి. ఇలా లిఫ్ట్‌లు కింద పడుతున్నపుడు ఏం చేయాలో.. ప్రాణాలు ఎలా రక్షించుకోవాలో చాలా మందికి తెలీదు. లిఫ్ట్ కింద పడుతున్నపుడు ఈ పనులు చేస్తే ప్రాణాలతో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
లిఫ్ట్ కూలిపోతుంటే ఏం చేయాలి?..
లిఫ్ట్ వేగంగా కింద పడుతున్నపుడు లిఫ్ట్ ఫ్లోర్ మీద పడుకోవాలి. మీ శరీరాన్నంతా విస్తరించి.. లిఫ్ట్ ఫ్లోర్‌కు బాగా ఆనించాలి. ఇలా చేయటం వల్ల కిందపడ్డపుడు కలిగే నష్టం తీవ్రత తగ్గుతుంది. ఇలా కాకుండా మీరు నిలబడ్డా.. కూర్చొన్నా కూడా దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తర్వాత మీ తలను రెండు చేతుల్తో కప్పేసుకోవాలి. ఇలా చేస్తే మీ తలకు ప్రమాదకరమైన గాయాలు అవ్వకుండా ఉంటాయి. సినిమాల్లో చూపించినట్లు పైకి గెంతడాల్లాంటివి చేయకూడదు. అలా చేస్తే వేగంగా వచ్చి లిఫ్ట్ ఫ్లోర్‌కు తాగిలే అవకాశం ఉంది. వీటన్నింటికంటే.. లిఫ్ట్‌లోనే కొన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. లిఫ్ట్ కింది భాగంలో సేఫ్టీ గియర్స్, బఫ్ఫర్స్ ఉండటం వల్ల లిఫ్ట్ కిందపడ్డపుడు ప్రమాద తీవ్రత తగ్గుతుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియకే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇప్పటి వరకు ఆమె ఒక్కతే..
1945 జులై 28, న్యూయార్క్‌కు చెందిన 20 ఏళ్ల బెట్టీ లో ఓలివర్ అనే యువతి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌లోని లిఫ్ట్‌లొ.. ఎలివేటర్ గాల్‌గా పని చేస్తోంది. లిఫ్ట్‌లోకి ఎక్కేవాళ్ల యోగక్షేమాలు చూసుకోవడమే ఆమె పని. బెట్టి 80వ అంతస్తులో ఉండగా.. అమెరికన్ బీ25 బాంబర్ ప్లేన్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మీదకు దూసుకువచ్చింది. దాని కారణంగా బిల్డింగ్ చాలా వరకు ధ్వంసం అయింది. ఈ నేపథ్యంలోనే కేబుల్ తెగి.. లిఫ్ట్ 75 అంతస్తుల నుంచి కిందకు పడింది. బలంగా బేస్‌మెంట్‌ను తాకింది. లిఫ్ట్ మొత్తం పచ్చడైంది. ఇంత జరిగినా అందులో ఉన్న బెట్టి ప్రాణాలతో బయటపడింది. ఆమె మెడ, నడుము, పెల్విస్ మాత్రమే విరిగాయి. కొద్దిరోజుల తర్వాత ఆమె ఆ గాయాల నుంచి కూడా కోలుకుంది. 75 అంతస్తుల బిల్డింగ్ మీదనుంచి కిందపడి కూడా బతికినందుకు గాను ఇప్పటికీ ఆమె మీద గిన్నిస్ రికార్డు ఉంది. లిఫ్ట్ ఇన్సిడెంట్ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘ లిప్ట్ వేగంగా కిందుకు వెళుతూ ఉంది. నేను గట్టిగా అరుస్తూ ఉన్నాను. లిప్ట్ ఫ్లోర్ మీద కొట్టుకుంటూ ఉన్నాను. గాల్లో ఎగరకుండా ఉండటానికి లిఫ్ట్ సైడ్లను పట్టుకున్నాను’ అని చెప్పింది.
ఇవి కూడా చదవండి:
Southern States Meeting: అరుదైన దృశ్యం.. ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్..
FIIs: యూటర్న్ తీసుకున్న ఎఫ్ఐఐలు.. భారత స్టాక్ మార్కెట్ ఇక పైపైకేనా..
Updated Date – Mar 22 , 2025 | 05:00 PM