Education: గురుకులాలు సరే.. భవనాలేవీ?

Written by RAJU

Published on:

310 బీసీ గురుకులాల్లో 270 అద్దె భవనాల్లోనే!..

కొత్తగా మరో 17 మంజూరు

కొత్త జిల్లాల్లో అనువైన భవనాలు కరువు

కిరాయి భవనాల కోసం అధికారుల వేట

268 ఎస్సీ గురుకులాల్లో 106 ‘అద్దె’కే

ఎస్టీ గురుకులాలు, హస్టళ్లూ అంతే

భవనాల నిర్మాణం ఊసెత్తని సర్కారు

హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల్లో విద్యార్థులకు అత్యుత్తమ విద్యా బోధన జరుగుతోందని ఘనంగా చెప్పుకొంటోంది. గురుకులాల గురించి ఇంత గొప్పగా చెబుతున్న సర్కారు.. వాటికి అవసరమైన భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడంలో మాత్రం విఫలమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సింహభాగం గురుకులాలకు సొంత భవనాలు లేవు. అద్దె భవనాలు, అరకొర సౌకర్యాలతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురకులాలతో పాటు ఆయా శాఖల్లోని సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలకూ సొంత భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైగా, సర్కారు ఏటా కొత్త గురుకులాలను మంజూరు చేస్తోంది! కొత్త గురుకులాల మంజూరు, ఉన్న వాటిని అప్‌గ్రేడ్‌ చేయడం స్వాగతించదగ్గ విషయమే. కానీ, ప్రస్తుతం ఉన్నవాటికే సొంత భవనాలు ఏర్పాటు చేయకపోవడం, కొత్తగా మంజూరు చేసే గురుకులాలకు ప్రత్యామ్నాయ భవనాలు, వాటిలో మౌలిక సౌకర్యాలను కల్పించకపోవడమే సమస్యగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది, ఈ ఏడాది కలిపి ఒక్క బీసీ శాఖ పరిధిలోనే 32 గురుకులాలను మంజూరు చేసింది. వీటిలో గత ఏడాది ఇచ్చిన 15 గురుకులాలకు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన భవనాలు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. తాజాగా మరో 17 గురుకులాలను మంజూరు చేయడంతో పాటు ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తామని సర్కారు తెలిపింది. దీంతో కొత్త గురుకులాలకుభవనాలు ఎక్కడ వెతకాలని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

గురుకులం.. అద్దె భవనం..

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, ఎస్సీ, బీసీ శాఖల పరిధిలోని సంక్షేమ వసతి గృహాలు, స్కూళ్లు, కాలేజీలకు సొంత భవనాలు లేవు. దీంతో ఈ శాఖ పరిధిలో సర్కారీ విద్య ‘అద్దె’లోనే సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 700 హాస్టళ్లున్నాయి. వీటిలో 310కి పైగా హాస్టళ్లు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. నెలకు రూ.1.30కోట్ల చొప్పున, ఏడాదికి హాస్టళ్లకు రూ.15కోట్లకుపైగా అద్దె చెల్లిస్తున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి హాస్టళ్ల నిర్మాణానికి పూనుకుంటే ఎంతోమంది విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. కానీ, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 268 ఎస్సీ గురుకులాలున్నాయి. వీటిలో 106 అద్దె భవనాల్లో ఉండగా, 29 సొంత భవనాల్లో ఉన్నాయి. ఎస్సీ గురుకులాలకు అవసరమైన భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం గతంలో టెండర్ల వరకు వెళ్లింది. కానీ, ఏమైందో ఏమో.. చివరి నిమిషంలో ఆ ప్రక్రియను నిలిపివేసింది. ఇక గిరిజన గురుకులాలు 162 ఉండగా వీటిలో 39 అద్దె భవనాల్లోనే ఉన్నాయి.

కొత్త జిల్లాల్లో భవనాల కొరత..

రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో అయితే గురుకులాలకు భవనాలే దొరకడం లేదు. సొంత భవనాలు లేకపోవడం, అనువైన భవనాలు దొరక్కపోవడంతో హైదరాబాద్‌లోని రెండు బీసీ గురుకులాలను ఇబ్రహీంపట్నంలోని ఒకే భవనంలోకి మార్చాల్సి వచ్చింది. బీసీ శాఖలోనే కాదు.. ఇతర గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో భవనాల కోసం అధికారులు వేట మొదలుపెట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా గురుకులాలు, సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలకు సొంత భవనాలను ఏర్పాటు చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

బీసీ గురుకులాలు దాదాపు ‘అద్దె’లోనే..!

రాష్ట్రంలో ప్రస్తుతం బీసీ గురుకులాలు 310 ఉన్నాయి. వీటిలో 275 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ భవనాల కిరాయికి ఏటా రూ.70-80 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. తాజాగా బీసీ శాఖ పరిధిలో మరో 17 గురుకులాలను మంజూరు చేయడంతో వాటికి భవనాలు ఎలా ఏర్పాటు చేయాలన్నది అధికారులకు అంతు చిక్కడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పిస్తే.. కొన్ని నిధులను గ్రాంట్ల కింద అందించేందుకు అవకాశం ఉంది. కానీ, రాష్ట్ర సర్కారు కేంద్రానికి నివేదికలు పంపడం లేదు. ఒకవేళ రాష్ట్రమే మొత్తం నిర్మాణ ఖర్చును భరించాలంటే అన్ని గురుకులాల భవనాల నిర్మాణానికి సుమారు రూ.7 వేల కోట్లు అవసరమవుతాయని ఇంజనీరింగ్‌ అధికారుల అంచనా. అయితే సర్కారు సొంత భవనాలను నిర్మించకపోగా, కేంద్రం ఇచ్చే నిధులనూ వినియోగించుకునే ప్రయత్నం చేయడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో బీసీ గురుకులాలు కిరాయి భవనాల్లోనే కొనసాగుతున్నాయి.

Updated Date – 2023-07-11T11:49:33+05:30 IST

Subscribe for notification