Education: ఏపీలో జాతీయ విద్యావిధానానికి తూట్లు

Written by RAJU

Published on:


ABN
, First Publish Date – 2023-09-01T10:55:50+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ విద్యావిధానానికి రాష్ట్రంలో తూట్లు పొడుస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఎన్‌ఈపీ అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచే డిగ్రీ స్థాయిలో కొత్త విధానంలో కోర్సులు ప్రారంభించింది.

Education: ఏపీలో జాతీయ విద్యావిధానానికి తూట్లు

  • 10 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే కాలేజీ మార్చేయండి లేదా కోర్సులు మార్పించండి

  • ప్రిన్సిపాళ్లతో సమావేశంలో కమిషనర్‌ ఆదేశాలు

(రాయచోటి-ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ విద్యావిధానానికి రాష్ట్రంలో (AP Government) తూట్లు పొడుస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఎన్‌ఈపీ అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచే డిగ్రీ స్థాయిలో కొత్త విధానంలో కోర్సులు ప్రారంభించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌ విధానంలో డిగ్రీలో అడ్మిషన్లు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా డిగ్రీ కళాశాలల్లో ముఖ్యమైన కోర్సుల్లో కూడా ఆరేడుగురు మాత్రమే విద్యార్థులు చేరారు. కొన్నిచోట్ల ఇద్దరు, ముగ్గురే ఉన్నారు. పదిమంది లోపు విద్యార్థులు ఉన్న కళాశాలలు లెక్కకు మించి ఉన్నాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ పూర్తి కాకపోవడమే డిగ్రీలో విద్యార్థులు చేరకపోవడానికి ప్రధాన కారణమని డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేవమయ్యారు. ఈ సందర్భంగా కళాశాలల్లో విద్యార్థుల చేరిక విషయమై చర్చకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో ఏ కోర్సులో అయినా 10మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే వారిని మరొక కళాశాలకు మార్చాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. అలాకాకుంటే అదే కళాశాలలో ఉన్న మరో కోర్సులోకి అయినా మార్చమని సూచించినట్లు సమాచారం. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇష్టమైన గ్రూపుల్లో చేరితే.. మధ్యలో ఇలాచేస్తే తమ పిల్లలు నష్టపోతారని ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు తమకు అనుకూలమైన కాలేజీల కాకుండా మరెక్కడికో మారిస్తే ఇబ్బందులు పడతామని వాపోతున్నారు. ఎంసెట్‌ ఫలితాలు వచ్చి నెలలు గడుస్తున్నా సకాలంలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ పూర్తి చేయకపోవడం వల్లేఈ దుస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. సాధారణంగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంటు ఇస్తుండటంతో ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌పై మక్కువ చూపుతున్నారు. అక్కడ సీట్లు దొరక్కపోతేనే డిగ్రీలో చేరడానికి సిద్ధపడతారు. అయితే ఇంజనీరింగ్‌ కౌనెన్సిలింగ్‌ ఇప్పటికి మొదటి విడత మాత్రమే పూర్తయింది. ఇంకా చాలామంది ఇంజనీరింగ్‌ సీట్ల కోసమే ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 10కంటే తక్కువ మంది చేరారనే కారణంతో ఆయా కోర్సుల్లో ప్రస్తుతానికి చేరిన విద్యార్థులను మరొ క కోర్సుకు మారమని చెప్పడం, కళాశాలలను మార్చడం దారుణమని తల్లిదండ్రులు, విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు పునరాలోచించాలని, ఎన్‌ఈపీ విధానంలో ఇదే మొదటి సంవత్సరం అయినందున తక్కువమంది విద్యార్థులు ఉన్నప్పటికీ కోర్సులు యథావిధిగా జరిగేలా చూడాలని కోరుతున్నారు. విద్యార్థులు లేరనే నెపంతో.. కోర్సులను మూసేస్తే.. రేషనలైజేషన్‌ పేరుతో తమ పోస్టులు కూడా గల్లంతయ్యే ప్రమాదముందని అధ్యాపకులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రతి కోర్సులోనూ పది మందికి పైగా విద్యార్థులను చేర్చుకునే పనిలో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు నిమగ్నమయ్యారు.

Updated Date – 2023-09-01T10:55:50+05:30 IST

Subscribe for notification