
ED Rides: హైదరాబాద్‌లోని రెండు ప్రముఖ కంపెనీలపై ప్రస్తుతానికి ED (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సోదాలు నిర్వహిస్తోంది. సురానా ఇండస్ట్రీస్, సాయి సూర్య డెవలపర్స్ సంస్థలపై చట్టవ్యతిరేక కార్యకలాపాల అనుమానంతో ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో బోయిన్‌పల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఈడి అధికారులు సోదాలు చేస్తున్నారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక ఈడి బృందాలు నాలుగు ప్రాంతాల్లో ఈ సోదాలను నిర్వహిస్తున్నాయి. ఈ దర్యాప్తులో సంస్థల చైర్మన్‌లు, మేనేజింగ్ డైరెక్టర్లు ప్రధానంగా విచారణ ఎదురుకోనున్నారు.
సురానా గ్రూపు చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణాలను పొందినట్లు సమాచారం. అయితే, ఆ రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఇదివరకే సురానా గ్రూపుపై సీబీఐ కేసు కూడా నమోదు అయింది. ఇక సురానా గ్రూపుకు అనుబంధంగా ఉన్న సాయి సూర్య డెవలపర్స్ సంస్థపై కూడా అనుమానాలు వ్యక్తం కావడంతో, ఈడీ సోదాలు అక్కడి కార్యాలయాల్లోను కొనసాగుతున్నాయి. ఈ రెండు సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు, రుణ వినియోగంపై లోతుగా పరిశీలన జరుపుతోంది ఈడి. ఈ సోదాల నేపథ్యంలో హైదరాబాద్ వ్యాపార వర్గాల్లో కలకలం రేగింది.