ABN
, Publish Date – Apr 01 , 2025 | 05:29 AM
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ప్రేమ వివాహం చేసుకున్న శివను, కుటుంబ కలహాల నేపథ్యంలో అతని బావమరిది, మామ, మరికొందరు కలిసి అత్యంత పాశవికంగా హత్య చేశారు. భోజనం చేస్తుండగా వెనక నుంచి దాడి చేసి కత్తులతో అతని గొంతుకోసి హత్య చేశారు

యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని సరిగా ఏలుకోవడంలేదని తూర్పులో దారుణం
నల్లజర్ల, మార్చి 31(ఆంధ్రజ్యోతి): బావమరిది అంటే బావ బతుకు కోరేవాడని అంటారు!. కానీ.. యువతిని ప్రేమ పెళ్లి చేసుకుని సక్రమంగా ఏలుకోవడంలేదని బావను సొంత బావమరిది, అతడి తండ్రి (మామ).. మరో ముగ్గురు కలిసి అత్యంత పాశవికంగా హత్య చేశారు. గొంతులో ముద్ద దిగుతుండగానే గొంతుకోశారు. పోలీసులు, ఇరు కుటుంబాల కథనం మేరకు.. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన పేరం శివ(27) తన ఇంటి పక్కనే ఉన్న రేగుల వెంకటేశు కుమార్తె భానుని నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల పాప ఉంది. తరచూ దంపతుల మధ్య గొడవలు జరగడం పెద్దల్లో పెట్టి మళ్లీ రాజీ చేస్తూ వస్తున్నారు. శివ తరచూ మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవపడేవాడు. పెళ్లయినప్పటి నుంచి ఇదే తంతు. ఈ క్రమంలో మూ డు రోజుల కిందట భార్యభర్తల మధ్య మళ్లీ గొడవ జరగడంతో ఆమె పాపను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం తన భార్యను పంపించాలని శివ అత్తింటికి వెళ్లి కోరగా వారు నిరాకరించారు. దీంతో శివ తిరిగి ఇంటికి వెళ్లిపో యాడు. సోమవారం సాయంత్రం శివ మామ రేగుల వెంకన్న, బావమరిది శ్రీరామ్, బంధువులు మంగయ్య, రత్తయ్య, రాజు ఆయిల్ ఫాం గెలలు కోసే రెండు కత్తులు పట్టుకుని శివ ఇంటికి వెళ్లారు. భోజనం చేస్తున్న శివను వెనక నుంచి పట్టుకుని బావమరిది, మిగిలిన వారు ఒక్కసారిగా కత్తులతో పీక కోసి అత్యంత పాశవికంగా హతమార్చారు. రక్తపు మడుగులో గిలగిలలాడుతూ శివ అక్కడికక్కడే మృతిచెందాడు.
Updated Date – Apr 01 , 2025 | 05:31 AM