Earthquake: ‘సాయం చేయండి’.. శిథిలాల కిందే శవాల దిబ్బలు.. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే..

Written by RAJU

Published on:

యముడిలా దూసుకొచ్చిన వరుస భూకంపాలు.. మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో మరణ మృదంగం సృష్టిస్తున్నాయి. కళ్లముందే జరిగిన కల్లోలానికి వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఓవైపు శిథిలాల కింద శవాల దిబ్బలు.. మరోవైపు కాపాడండి అనే ఆర్తనాదాలతో మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో ఎటూ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. వరుస భూకంపాల తీవ్రతకు ఆయా దేశాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క మయన్మార్‌లోనే 200 మందికి మృతిచెందినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద వేల మంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్‌లోని నేపిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి, మాండలే నగరంలో ఐకానిక్‌ వంతెన, పలుచోట్ల ఎత్తైన ఆలయాలు, గోపురాలు భూకంప తీవ్రతకు కుప్పకూలాయి. మయన్మార్‌ రాజధాని నేపిడాలో ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి.

థాయ్‌లాండ్‌లో శిథిలాల కిందే వేల మంది బాధితులు

వరుస భూకంపాల దెబ్బకు థాయ్‌లాండ్‌ అల్లకల్లోలమైంది. పెద్దపెద్ద బిల్డింగ్‌లే నేలమట్టం కావడంతో శిథిలాల కింద వేల మంది చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బ్యాంకాక్‌లో భూప్రకంపనలతో ఓ భారీ భవంతి పైఅంతస్తులో ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌లోని నీరు కిందకు పడుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో సుమారు 100మందికి పైగా గల్లంతయ్యారు. థాయ్‌లాండ్‌లోనూ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

థాయ్‌లాండ్‌లో కూలిన ఎత్తైన భవనాల కింద చిక్కుకొని హాహాకారాలు చేస్తున్నవారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్‌ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు తమ కుటుంబ సభ్యులతోపాటు సర్వం కోల్పోయి రోదిస్తున్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. భూకంపం నేపథ్యంలో థాయ్‌లాండ్‌లో ప్రధాని షినవత్ర ఎమర్జెన్సీ ప్రకటించారు.

ఇక.. భూప్రళయంతో విలవిల్లాడుతున్న మయన్మార్, థాయ్‌లాండ్‌ అంతర్జాతీయంగా సాయం కోసం ఎదురుచూస్తోంది. దాంతో.. భూకంప క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకొచ్చింది. దుబాయిలోని WHO లాజిస్టిక్స్‌ హబ్‌ను రెడీ చేస్తున్నట్లు ప్రకటించింది.

భారత్ సాయం..

మరోవైపు.. భూకంప బాధిత మయన్మార్‌, థాయ్‌లాండ్‌ దేశాలకు ఎలాంటి సాయం అందించేందుకైనా భారత్‌ సిద్ధమన్నారు ప్రధాని మోదీ. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. భూకంపంతో దెబ్బతిన్న మయన్మార్‌కు శనివారం భారతదేశం సైనిక రవాణా విమానంలో దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని పంపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఏ దేశమైన తమకు సహాయం చేయాలని మయన్మార్ కోరింది.. అయితే.. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాము సహాయం చేస్తామని ప్రకటించారు. భూకంపం కారణంగా దాదాపు 150 మంది మరణించిన మయన్మార్‌కు ఐక్యరాజ్యసమితి సహాయాన్ని సేకరిస్తోందని సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ శుక్రవారం తెలిపారు.

మరోసారి భూకంపం..

ఇదిలాఉంటే.. మయన్మార్‌లో మరోసారి భూకంపం అలజడి రేపింది.. అర్ధరాత్రి 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం.. శుక్రవారం రాత్రి 11:56 గంటలకు మయన్మార్‌ను రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం కుదిపేసిందని అధికారులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Subscribe for notification
Verified by MonsterInsights