హైదరాబాద్, మార్చి 24: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్-ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ 2025 ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆన్‌లైన్ దరఖాస్తుల్లో అభ్యర్ధులకు విచిత్ర సంకటం ఏర్పడింది. అదేంటంటే హైదారబాద్ మినహా మిగతా అన్ని సెంటర్లను జేఎన్టీయే బ్లాక్ చేసింది. ఈఏపీసెట్‌లో దాదాపు 12 టెస్ట్ జోన్లను జేఎన్టీయూ అధికారులు బ్లాక్ చేశారు. ఈ 12 టెస్ట్ జోన్లల్లో ఇప్పటికే సెంటర్ల సామర్థ్యం మేరకు దరఖాస్తులొచ్చాయి. దీంతో కొత్తగా దరఖాస్తు చేసే వారికి ఆయా టెస్ట్‌జోన్లల్లో సెంటర్లు కేటాయించలేని పరిస్థితి నెలకొంది.
ఇకపై ఈఏపీసెట్‌కు కొత్తగా ఎవరు దరఖాస్తు చేసుకునేవారు ఎవరైనా హైదరాబాద్‌లోనే సెంటర్లను కేటాయిస్తారు. దీంతో ఈఏపీసెట్‌కు సెంటర్ల కేటాయింపు సమస్యగా మారింది. జిల్లాల నుంచి భారీగా దరఖాస్తులు రావడంతో ఈ పరీక్షలు నిర్వహించే సెంటర్లు హౌజ్‌ఫుల్ కావడమే ఇందుకు కారణం. దీంతో శనివారం వరకు రాష్ట్రంలోని 12 టెస్ట్ జోన్లను జేఎన్టీయూ అధికారులు బ్లాక్ చేశారు. దరఖాస్తు చేసుకునే కొత్తవారికి ఈ టెస్ట్ జోన్లు అందుబాటులో లేకుండా చేశారు. తాజా సమాచారం ప్రకారం ఒక్క హైదరాబాద్ మినహా ఎక్కడా సెంటర్లు కేటాయించలేని పరిస్థితి నెలకొంది.
అయితే ఏప్రిల్ 4 వరకు ఈఏపీసెట్‌కు దరఖాస్తు గడువు ఉండటంతో ఇంకా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీంతో పరీక్ష సెంటర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రూ. 250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 9 వరకు, రూ. 500తో ఏప్రిల్ 14 వరకు, రూ. 2,500తో ఏప్రిల్ 18 వరకు, రూ. 5వేలతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసే అవకాశంది. పైగా తాజాగా ఇంటర్ వార్షిక పరీక్షలు ముగియడంతో దరఖాస్తులు భారీగా పెరగనున్నాయి. దీంతో సెంటర్ల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు జేఎన్టీయూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. శనివారం నాటికి ఈఏపీసెట్‌కు 1,75,991 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్‌లో 1,27,758, అగ్రికల్చర్, ఫార్మసీకి 48,115 దరఖాస్తు చేసుకోగా.. రెండింటికి కలిపి 118 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.