Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటిని నుంచీ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. తాను తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాల్లో తీవ్ర భయాందోళనకు కారణం అవుతున్నాయి. తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక అయ్యేందుకు మార్గాలున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. తాను మూడోసారి బాధ్యతలు చేపట్టడాన్ని ఆయన తోసిపుచ్చలేదు. ఈ విషయంలో తాను జోక్ చేయడం లేదంటూ స్పష్టం చేశారు. అయితే దీనిపై ఇప్పుడే ఆలోచించడం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఎన్బీసీ న్యూస్ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమితించదు. చాలా మంది ప్రజలు మూడోసారి ఎన్నిక కావాలని నన్ను కోరుతున్నారు.
అయితే దానికి ఇంకా చాలా సమయం ఉందని వారికి చెప్పాను. దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుందని తెలుసు. ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి పెట్టాను అని ట్రంప్ పేర్కొన్నారు. మరోసారి అధికారం చేపడతారా అని ప్రశ్నించగా..తనకు పని చేయడం ఇష్టమని తెలిపారు ట్రంప్.
తొలుత జేడీ వాన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి తర్వాత దానిని ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యే మీకు బదిలీ చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు అది ఒక పద్దతని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతోపాటు ఇతర మార్గాలూ ఉన్నాయని వివరించారు. అవేంటని ప్రశ్నిస్తే చెప్పనంటూ సమాధానం ఇచ్చారు.
అమెరికా రాజ్యాంగంలో విధించిన రెండు దఫాల నిబంధనను మార్చాలంటే సవరణ చేయాలి. అది కష్టమైంది. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్ లో మూడింటి రెండువంతుల మెజార్టీ ఉండాలి. లేదంటే మూడింటి రెండు వంతుల రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ రెండు మార్గాలనూ నాలుగింటి మూడువంతుల రాష్ట్రాలు ఆమోదించాలి.
2028లోనూ ట్రంప్ అధ్యక్షుడిగా పోటీ చేసి ఎన్నికవుతారని ఆయన అనుమాయి స్టీవ్ బానన్ పేర్కొన్నారు. దీనికోసం మా ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని అని ఆయన వివరించారు.