- సుదీక్ష తల్లిదండ్రుల నిర్ణయంతో అనుమానితుడికి విముక్తి
- జాషువా రీబేను విడిచి పెట్టిన డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు

భారత సంతతి విద్యార్థిని సుదీక్ష (20) మిస్సింగ్‌పై ఆమె తల్లిదండ్రులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ కుమార్తె చనిపోయినట్లుగా ప్రకటించాలని అధికారులను కోరారు. మీడియా సమావేశంలో లేఖను చూపించారు. ఈ సందర్భంగా సుదీక్ష తల్లి ఎక్కి ఎక్కి ఏడ్చేసింది. ఇక సుదీక్ష తల్లిదండ్రుల ప్రకటన తర్వాత.. అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్న జాషువా రీబేను అధికారులు విడిచిపెట్టేశారు. గత రెండు వారాలుగా రీబే పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అతడి పాస్‌పోర్టు కూడా జప్తు చేశారు. సుదీక్ష.. రీబేతోనే కలిసి తిరిగింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కానీ అతడి మాటలను బట్టి చూస్తే.. అతడి ప్రమేయం ఏ మాత్రం కనిపించలేదు. దీంతో ఎట్టకేలకు విముక్తి కల్పించారు.
సుదీక్ష అమెరికా పౌరురాలు. వర్జీనియాలో నివాసం ఉంటుంది. పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. అయితే సెలవులు రావడంతో ఐదుగురు స్నేహితులతో కలిసి మార్చి 5న కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లింది. అయితే మార్చి 6న రిసార్ట్‌లో మందు పార్టీ చేసుకున్నారు. అనంతరం జాషువా రీబేతో కలిసి బీచ్‌లోకి వెళ్లింది. అయితే ఒంటరిగా ఉంటానని స్నేహితులకు చెప్పడంతో ఫ్రెండ్స్ తిరిగి వచ్చేశారు. రీబేతో కలిసి సుదీక్ష బీచ్‌లో విహరించారు. అయితే అప్పటికే సుదీక్ష స్పృహలో లేదు. ఇద్దరూ కలిసి బీచ్‌లోకి వెళ్లారు. అయితే ఒక అల రావడంతో ఇద్దరు కొట్టుకుపోయారు. తిరిగి బయటకు వచ్చేశారు. నీళ్లు మింగేయడంతో సుదీక్ష వాంతు చేసుకున్నట్లు రీబే తెలిపాడు. అనంతరం బీచ్ ఒడ్డున నిద్రపోయినట్లుగా చెప్పాడు. ఆ తర్వాత సుదీక్ష ఏమైందో తనకు తెలియదని పేర్కొన్నాడు.
సుదీక్ష జాడ తెలియకపోవడంతో స్నేహితులు అధికారులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన అధికారులు హెలికాప్టర్లు, పడవలు, డ్రోన్లతో వెతికారు. కానీ ఆచూకీ లభించలేదు. దీంతో బీచ్‌లో కొట్టుకుపోయిందని తెలిపారు. అయితే తల్లిదండ్రులు ఈ వాదనను తోసిపుచ్చారు. బీచ్‌లో కొట్టుకుపోతే శవం తిరిగి రావాలని వాదించారు. కానీ చివరికి తమ కుమార్తె చనిపోయినట్లుగా ప్రకటించాలని డొమినికన్ రిపబ్లిక్ అధికారులకు లేఖ రాయడంతో కథ సుఖాంతం అయింది.