ABN
, Publish Date – Mar 15 , 2025 | 03:44 AM
ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డుల అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయాలని నిర్ణయించింది.

-
ఏప్రిల్ నుంచి రోగుల వివరాలు ఆన్‌లైన్‌లో
-
దశల వారీగా అన్ని ఆస్పత్రుల్లో అమలు
-
ప్రత్యేక ఐడీ సంఖ్యతో ‘అబా’ కార్డు జారీ
-
దాంతో ఏ ఆస్పత్రిలోనైనా రోగి వివరాలు
హైదరాబాద్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డుల అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ)కు వచ్చే రోగుల వివరాలను ఆన్‌లైన్ చేయడం ప్రారంభించనున్నారు. తొలుత ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని పీహెచ్‌సీల్లో, ఆ తర్వాత తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రుల్లో, అనంతరం వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని బోధనాస్పత్రుల్లో దశలవారీగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ డిజిటల్ హెల్త్ రికార్డు కోసం ప్రతీ పీహెచ్‌సీలో ఓ కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్‌తోపాటు డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను అందుబాటులో ఉంచనున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగి ఆధార్ కార్డు సంఖ్య ఆధారంగా వారి వివరాలను ఆన్‌లైన్ చేస్తారు. ఒకవేళ ఆధార్ లేకుంటే ప్రత్యేకంగా ఓ ఐడీని రూపొందించి వివరాలు నమోదు చేస్తారు. ఈ వివరాలను అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు అనుసంధానం చేస్తారు. రోగి మళ్లీ ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినప్పుడు తన ఐడీ సంఖ్యను చెబితే.. అక్కడి వైద్యులు సదరు రోగి ఆరోగ్య చరిత్రను ఆన్‌లైన్‌లో చూడవచ్చు. ఉదాహరణకు ఎవరైనా అనారోగ్యంతో ఆస్పత్రికి వెళితే వారి ఆధార్ కార్డు సంఖ్య ఆధారంగా అబా నెంబరు(ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబరు) జారీ చేస్తారు. 14 అంకెలతో ఉండే ఈ అబా నెంబర్‌నే డిజిటల్ హెల్త్ ఐడీ అని కూడా అంటారు. ఒక్కసారి ఇది జనరేట్ అయితే ఎప్పటికీ అదే నెంబరు ఉంటుంది. ఈ ఐడీ నెంబర్ సాయంతో రోగి ఆరోగ్య వివరాలను ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనైనా వైద్యులు చూడవచ్చు. రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర సమయాల్లో ఈ డిజిటల్ ఐడీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
తెలంగాణ డయాగ్నస్టిక్స్‌తో అనుసంధానం
రోగుల వివరాలను ఆన్‌లైన్ చేసే విధానాన్ని తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఓ 50 ఆస్పత్రుల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఆయా ఆస్పత్రులకు వచ్చిన రోగుల(ఓపీ, ఐపీ) వివరాలను ఆన్‌లైన్ చేశారు. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు, సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించారు. అలాగే వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని 30 ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ వివరాలను ఆన్‌లైన్ చేస్తున్నారు. ఇక, డిజిటల్ హెల్త్ రికార్డును తెలంగాణ డయాగ్నస్టిక్‌తోనూ అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం పీహెచ్‌సీలకు వచ్చే రోగుల రక్త, మూత్ర నమూనాలను పరీక్షల నిమిత్తం తెలంగాణ డయాగ్నస్టిక్‌కు పంపుతున్నారు. ఆయా నమూనాల ఫలితాల నివేదికలను ఇకపై డిజిటల్ హెల్త్ ఐడీకి జత చేస్తారు. దీంతో రోగి తన ఐడీ లేదా ఆధార్ నెంబర్ చెబితే.. ఆయా టెస్టుల ఫలితాలతోపాటు సమస్త ఆరోగ్య చరిత్రను వైద్యులు ఆన్‌లైన్‌లో చూసే వెసులుబాటు ఉంటుంది. దీంతో చికిత్స మరింత సులభతరం అవుతుంది. కాగా, ప్రజల ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసేందుకు అవసరమయ్యే నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తితో సమకూరుస్తున్నాయి. గ్రామాల్లో ప్రజలందరికీ అబా నెంబర్ రూపొందించి ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది పని చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని వైద్యవర్గాలు వెల్లడించాయి.
Updated Date – Mar 15 , 2025 | 03:44 AM