
Delhi Rains: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన కుండపోత వర్షంతో ఢిల్లీ తడిసి ముద్దైంది. ఈ వర్షంతో వేసవి నుంచి ఢిల్లీ వాసులకు కాస్త ఉపశమనం లభించినప్పటికీ రోజువారీ పనులకు ఆటంకం కలిగింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 40 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులకు ఎయిర్ పోర్టు అడ్వైజరీ జారీ చేసింది. అటు ఎయిరిండియా, ఇండిగో కూడా ప్రయాణికులకు అలర్ట్ లు పంపించాయి. తాజా అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి.
రానున్న కొన్ని గంటల్లో ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో రాజధానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతేకాదు గంటకు 70 నుంచి 80కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే తెల్లవారుజామున కురిసిన వర్షానికి లప్ పత్ నగర్, ఆర్కే పురం, ద్వారక తదితర ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది.
అటు హర్యాణలో నేడు భారీ వర్షం కురిసింది. ఝజ్జర్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ నదులను తలపించాయి. ఊహించని వాతావరణ మార్పులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.