- భారత్‌కి వ్యతిరేకంగా పాకిస్తాన్ పార్లమెంట్ తీర్మానం..
- రాజకీయ లక్ష్యంతో కుట్ర చేస్తుందని ఆరోపణలు..
- పహల్గామ్ దాడిని తమ దేశంతో ముడిపెట్టడంపై ఆగ్రహం..

Pakistan: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినట్లు ప్రకటించింది. అయినప్పటికీ, ఈ దాడి గురించి పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పష్టమైన ఖండన రాలేదు. దీనికి తోడు, భారత్ దాడి చేస్తే ప్రతిదాడి ఎలా చేయాలనే దానిపైనే దాయాది దేశం చూపు ఉంది. ఆ దేశం నుంచి ఉగ్రవాదులు వచ్చి దాడులకు పాల్పడినట్లు తెలిసినా కూడా తమ వారు కాదని ఇంకా బుకాయిస్తోంది.
Read Also: Indus water: “సింధు నది” నీరు పాకిస్తాన్‌కి దక్కకుండా భారత్ వ్యూహం..
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ పార్లమెంట్‌లో ఎగువ సభ సెనెట్ భారత్‌కి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించింది. ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు, దీనికి పార్లమెంటు ఎగువ సభలోని పార్టీల నుండి అన్ని పార్టీల మద్దతు లభించింది. ‘‘పనికిరాని, నిరాధారమైన ప్రయత్నాలను’’ తిరస్కరిస్తున్నట్లు తీర్మానంలో పేర్కొంది. అమాయకులైన పౌరుల్ని చంపడం పాక్ విధానాలకు విరుద్ధమని చెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడిని తమ దేశంతో ముడిపెట్టడాన్ని పాకిస్తాన్ ఖండించింది.
“పాకిస్తాన్‌ని జల ఉగ్రవాదం లేదా సైనిక రెచ్చగొట్టడం వంటి ఏదైనా దురాక్రమణకు వ్యతిరేకంగా తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడానికి పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు సిద్ధంగా ఉంది” అని తీర్మానం పేర్కొంది. సంకుచితమైన రాజకీయ లక్ష్యాల కోసం ఉగ్రవాద సమస్యని భారత్ ఉపయోగించుకుంటోందని ఆరోపించింది. పాకిస్తాన్‌ని కుట్ర పూరితంగా భారత్ కించపరుస్తోందని తీర్మానం పేర్కొంది. . సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారతదేశం ప్రకటించడాన్ని కూడా తీర్మానం ఖండించింది మరియు ఈ చర్య “యుద్ధ చర్య” అని పేర్కొంది.