ABN
, Publish Date – Mar 23 , 2025 | 04:35 AM
మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించేందుకు వాడే హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) టీకాలు అందించే విషయంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

హైదరాబాద్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించేందుకు వాడే హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) టీకాలు అందించే విషయంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రంలో క్యాన్సర్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆ రోగులకు చికిత్స అందించేందుకు ఉమ్మడి జిల్లాల్లో రీజినల్ క్యాన్సర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు. ఇప్పటికే క్యాన్సర్ మొబైల్ స్ర్కీనింగ్ యూనిట్లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. శనివారం శాసనసభలో ఆరోగ్య పద్దుపై జరిగిన చర్చలో రాజనర్సింహ మాట్లాడారు. జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి అసంక్రమిత రోగుల సంఖ్య పెరుగుతోందన్నారు.
రోగులకు వైద్యం అందించేందుకు ప్రతి జిల్లాలో ఎన్‌సీడీ క్లీనిక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సుమారు 50లక్షల మంది రోగులకు ఈ క్లీనిక్‌ల ద్వారా వైద్యం అందుతోందని చెప్పారు. ప్రస్తుతం గుండె మార్పిడి వంటి ఖరీదైన చికిత్సలు కూడా ఉచితంగా అందుతున్నాయంటే ఆనాడు ఆరోగ్యశ్రీని తీసుకరావడంలో తమ ప్రభుత్వ ముందు చూపే కారణం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో రోగుల సంఖ్యకు అనుగణంగా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని.. అందులో భాగంగా కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ‘రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలు కాపాడుకునేలా రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం 15 నిమిషాల వ్యవధిలో రోగులను ట్రామాకేర్ సెంటర్‌కు తరలించి, చికిత్స అందించేలా ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది’ అని మంత్రి వివరించారు.
Updated Date – Mar 23 , 2025 | 04:35 AM