Custard Apple: సీజనల్ పండ్లు తింటే చాలా రోగాలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక చలికాలంలో వచ్చే సీతాఫలం పండ్లకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ పండు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఈ సీతాఫలం టేస్ట్‌గా ఉండడమే కాదు, పోషకాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఈ పండు తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి.
ప్రయోజనాలు..
శరీరానికి అవసరమైన వివిధ రకాల పోషకాలు సీతాఫలం పండులో ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ B, విటమిన్ C, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి రకరకాల ప్రయోజనాలను అందిస్తాయి. సీతాఫలంలో ఉండే శక్తివంతమైన సమ్మేళనాలు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
సీతాఫలం పండులో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటును తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది. సీతాఫలం పండు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా పక్షవాతం వంటి వ్యాధులను కూడా నివారిస్తుంది.
సీతాఫలంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం, అతిసారం వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కోవడంలో కూడా సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయి అనవసరంగా పెరిగితే ఆరోగ్యానికి హానికరం. సమతుల్య కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడంలో సీతాఫలం పండు ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ నియాసిన్ కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా గుండె సమస్యలు, స్ట్రోక్, గుండెపోటు నుండి రక్షించడంలో సహాయపడుతుంది.