సీఎస్‌ఈకే క్రేజ్!
హాట్‌కేకుల్లా భర్తీ అవుతున్న కంప్యూటర్ సైన్స్ సీట్లు
రూ.లక్షలు పోసైనా ఆ బ్రాంచ్‌లో సీటు కోసం పాట్లు
ఇంజనీరింగ్‌లో ఇదొక్కటే కోర్సు అన్నంతగా డిమాండ్..
దీంట్లో సీటు రాకపోతేనే మిగిలిన బ్రాంచ్‌లలో చేరికలు
డిగ్రీలోనూ కంప్యూటర్ కోర్సులకే విద్యార్థుల మొగ్గు..
సాఫ్ట్‌వేర్ రంగంలో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు
కళ్లు చెదిరే ప్యాకేజీలకు ఆకర్షితులవుతున్న యువత..
సీఎస్‌ఈ అనుబంధ బ్రాంచ్‌లకు ఏఐసీటీఈ అనుమతులు
విజయవాడకు చెందిన ఓ ప్రముఖ కాలేజీ విద్యార్థులకు హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ క్యాంపస్‌లోనే రూ.14లక్షల ప్యాకేజీ ఇచ్చింది. కంపెనీ స్టాక్స్ కూడా కలిపితే ఏడాదికి రూ.18లక్షలు అవుతోంది. ఇదీ సీఎస్‌ఈ స్పెషాలిటీ! క్యాంపస్‌లో రాకపోయినా పెద్ద కంపెనీల్లో ప్రారంభ జీతం రూ.50వేలకు పైగానే! స్టార్టప్‌లు, మధ్యతరహా కంపెనీల్లో రూ.30 వేలతో మొదలుపెట్టినా చాలా తక్కువ వ్యవధిలోనే జీతాలు భారీగా పెరుగుతున్నాయి. కోడింగ్‌లో పట్టు సాధిస్తే పెద్ద కంపెనీలకు వెళ్లే అవకాశం ఉంటోంది.
గత విద్యా సంవత్సరంలో ఒక్క కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ) బ్రాంచ్‌లోనే వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 28,249 సీట్లుంటే మొత్తం నిండాయి. సీఎస్‌ఈ(ఏఐ)లో 7,668 సీట్లు, సీఎస్‌ఈ (డేటా సైన్స్)లో 5,517 సీట్లలోనూ విద్యార్థులు చేరిపోయారు. ఇక సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ, ఐటీ, బిజినెస్ సిస్టమ్స్, క్లౌడ్ కంప్యూటింగ్‌లలోనూ ఇదే పరిస్థితి. అదే సమయంలో మెకానికల్ విభాగంలో 9,749 సీట్లుంటే 6,022 మిగిలిపోయాయి. ఈఈఈలో 9,251 సీట్లకు గాను 3,166, సివిల్‌లో 7,945 సీట్లలో 4,560 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
(అమరావతి, ఆంధ్రజ్యోతి): ‘‘ఇంజనీరింగ్ అంటేనే సీఎస్‌ఈ… అసలు ఇంజనీరింగ్ అంటూ చదివితే ఈ బ్రాంచ్‌లోనే చదవాలి’’ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్‌కు ఉన్న డిమాండ్ ప్రస్తుతం పతాక స్థాయికి చేరింది. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు సైతం ఈ విభాగంలోనే పిల్లలను చేర్చడానికి ఆసక్తి చూపుతున్నారు. విస్తృతమైన ఉద్యోగావకాశాలు లభిస్తుండటం, ఇతర బ్రాంచ్‌లతో పోలిస్తే సాఫ్ట్‌వేర్ రంగంలో వేగవంతమైన వృద్ధి ఈ ధోరణికి కారణమైంది. ఆరేడేళ్ల కిందటి వరకూ సీఎస్‌ఈకి ఈ స్థాయి డిమాండ్ లేదు. దీనిలో సీటు దొరక్కపోయినా ఇతర బ్రాంచ్‌ల్లో చేరదామని విద్యార్థులు భావించేవారు. అంతకుముందు మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్(ఈసీఈ), సివిల్, ఈఈఈ బ్రాంచ్‌లకు డిమాండ్ ఉండేది. సాఫ్ట్‌వేర్ రంగంలో పెరిగిన ఉద్యోగ అవకాశాలు, కళ్లు చెదిరే శాలరీ ప్యాకేజీలతో క్రమంగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. సివిల్, మెకానికల్‌తో పాటు ఎంబీఏ, సాధారణ డిగ్రీ చదివినవారు కూడా కోడింగ్‌లో పట్టు ఉంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదిస్తున్నారు. డిజిటలైజేషన్ ఊపందుకోవడంతో బ్యాక్ ఎండ్ నిపుణుల అవసరం కూడా పెరిగింది.
మూడంచెల విధానం
కొన్నేళ్ల క్రితం వరకూ సాఫ్ట్‌వేర్‌లో సింగిల్ లేయర్ విధానం ఉండేది. ఒక యాప్ లేదా వెబ్‌సైట్ పనిచేసేందుకు అవసరమైన కోడింగ్ రాయడం, వాటిని హోస్ట్ చేసే మిడిల్ వేరియెంట్, చివరగా యూజర్ ఇంటర్‌ఫేస్… ఇవన్నీ ఒకే లేయర్‌లా పనిచేసేవి. కొద్దిమందితోనే ఆ పనులన్నీ చేయించేవారు. కానీ ఇప్పుడు ప్రతి లేయర్‌ను వేగవంతం చేసేందుకు సాఫ్ట్‌వేర్ కంపెనీలు వాటిని వేర్వేరుగా విభజించాయి. మూడు లేయర్లకూ వేర్వేరుగా ఉద్యోగులను భర్తీ చేసుకుంటున్నారు. ఒక్కో విభాగంలో స్పెషలైజేషన్ చేసేవారిని తీసుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. డేటాను విశ్లేషించడం, దాన్ని క్లౌడ్ కంప్యూటింగ్‌లో వేగంగా సమాచార మార్పిడి, వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా సమాచారాన్ని అందించేందుకు ఏఐ నిపుణుల అవసరం పెరగడం సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగావకాశాలను పెంచింది.
ఇంటర్వ్యూల్లోనే కోడింగ్
ఒకప్పుడు ఏ బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ పూర్తిచేసినా కూడా కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు దొరికేవి. కానీ ఇప్పుడు ‘సీఎస్‌ఈ విద్యార్థులకు ప్రాధాన్యం’ అని కంపెనీలు ముందుగానే నిబంధన పెడుతున్నాయి. గతంలో ఇంటర్వ్యూ దశలో కోడింగ్‌పై లోతుగా ప్రశ్నలు అడిగేవారు కాదు. ఇప్పుడు కోడింగ్‌ను ఇంటర్వ్యూల్లో తప్పనిసరి చేశారు. దీంతో ఇతర బ్రాంచ్‌ల విద్యార్థులు విఫలమవుతున్నారు. అదే సీఎస్‌ఈ చదివితే కోడింగ్ సులభంగా రాసే అవకాశం ఉండటంతో ఆ బ్రాంచ్‌నే ఎక్కువమంది కోరుకుంటున్నారు.
భారీగా ఫీజులు
డిమాండ్‌కు అనుగుణంగా సీఎస్‌ఈ కోర్సు ఫీజులు కూడా భారీగా పెరిగిపోయాయి. డీమ్డ్, ప్రైవేటు యూనివర్సిటీల్లో ఈ బ్రాంచ్‌లో చదవాలంటే ఏడాదికి రూ.5లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. నాలుగేళ్లలో రూ.25లక్షల వరకూ అవుతోంది. మోస్తరు కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటాలో సీటు పొందాలన్నా ఏడాదికి కనీసం రూ.2లక్షలు ఫీజు ఉంది. అయునా కూడా సీఎస్‌ఈ సీటు కోసం విద్యార్థులు ఎగబడుతున్నారు. దీనిలో సీటు రాకపోతే డిగ్రీలో బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ కోర్సులకు పోటీపడుతున్నారు. డిప్లొమా విద్యార్థులు సైతం బీటెక్‌లో తిరిగి సీఎస్‌ఈలోనే చేరుతున్నారు.
కోర్ బ్రాంచ్‌లు తప్పనిసరి
విపరీతమైన డిమాండ్ ఉండటంతో కాలేజీలన్నీ వాటి బ్రాంచ్‌లను సీఎస్‌ఈగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ఈ ఏడాది నుంచి ఏఐసీటీఈ కొత్త నిబంధన తెచ్చింది. మొత్తం అన్ని బ్రాంచ్‌లు సీఎస్‌ఈలోకి మార్చడం కుదరదని, కోర్ బ్రాంచ్‌లు అంటే మెకానికల్, సివిల్, ఈఈఈ లాంటి వాటిలో కనీస సీట్లు కాలేజీల్లో తప్పనిసరిగా ఉండాలని షరతు విధించింది. తప్పనిసరి పరిస్థితుల్లో కోర్ బ్రాంచ్‌లు కొనసాగించాల్సి వస్తోందంటూ మేనేజ్‌మెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, సీఎస్‌ఈలో అనుబంధ బ్రాంచ్‌లకు ఏఐసీటీఈ విరివిగా అనుమతులు ఇస్తోంది. సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఏఐఎంల్, క్లౌడ్ కంప్యూటింగ్ తదితర కోర్సులకు సీట్లు కేటాయిస్తోంది. వాటిలో రెండు మూడు కోర్సులు కలిపి దాన్ని కూడా ఒక బ్రాంచ్‌గా చూపిస్తూ అనుమతులు మంజూరు చేస్తోంది. ఉదాహరణకు సీఎస్‌ఈ (ఐవోటీ, సైబర్ సెక్యూరిటీ విత్ బ్లాక్ చైన్ టెక్నాలజీ) లాంటి బ్రాంచ్‌లకు కూడా విపరీతంగా సీట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇంజనీరింగ్‌లో దాదాపు 40శాతం సీఎస్‌ఈ, దాని అనుబంధ బ్రాంచ్‌లే ఉన్నాయి.
Updated Date – 2023-07-07T11:24:44+05:30 IST