
Crime News: దుబాయ్ నగరంలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మత విద్వేషం కారణంగా ఒక పాకిస్తానీ వ్యక్తిచే దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ ఘటన దుబాయ్‌లోని ఓ ప్రసిద్ధ బేకరీలో గత శుక్రవారం చోటుచేసుకుంది. ఇక హత్యకు గురైన వ్యాకుతుల వివరాలు చూస్తే..
నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన ప్రేమ్ సాగర్ (40) అనే వ్యక్తి దుబాయ్‌లో గత ఆరు సంవత్సరాలుగా జీవనోపాధి కోసం పనిచేస్తున్నారు. మోడ్రన్ బేకరీ అనే హోటల్‌లో పనిచేస్తున్న ఆయన, ఏడాదిన్నర క్రితం స్వదేశానికి వచ్చిన తరువాత తిరిగి దుబాయ్ వెళ్లారు. అదే బేకరీలో పనిచేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రేమ్ సాగర్‌పై కత్తితో దాడి చేసి హత్య చేసినట్టు సమాచారం. అతడిని వెనుక నుండి కత్తితో దాడి చేసినట్టు అక్కడి బంధువుల ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
అంతేకాకుండా ఈ దాడిలో నిజామాబాద్ జిల్లా వ్యక్తి శ్రీనివాస్ కూడా మృతి చెందాడు. అలాగే మరొక ఇద్దరు తెలుగువారు గాయపడ్డట్టు సమాచారం. మత విద్వేషంతో పాకిస్తానీ వ్యక్తి వీరిపై దాడి చేసినట్టు అర్థమవుతోంది. దాడి అనంతరం పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడంతో అక్కడి స్థానికులను, అక్కడ పనిచేస్తున్న భారతీయులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్రేమ్ సాగర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషాదకర సమాచారం కుటుంబానికి ఇప్పటివరకు అధికారికంగా తెలియజేయలేదని తెలుస్తోంది. అటు, దుబాయ్ పోలీసులు పూర్తి విచారణ అనంతరం మృతదేహాన్ని స్వదేశానికి పంపిస్తారని సమాచారం.