2,300 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ బకాయిల విడుదల
ఒకేసారి మొత్తం విడుదలపై ఉద్యోగుల హర్షం
అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లు సీపీఎస్ ఉద్యోగులను జగన్ సర్కార్ రాచిరంపాన పెడితే… కూటమి సర్కార్ వారిని అక్కున చేర్చుకుంది. ఒకేసారి సీపీఎస్ ఉద్యోగుల ఫ్రాన్ ఖాతాల్లోకి ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాండ్ బకాయిలు రూ.2,300 కోట్లు చెల్లించేసింది. గత ప్రభుత్వం బకాయిపెట్టిన 5 నెలల సొమ్ముతోపాటు, కూటమి సర్కార్ వచ్చిన తర్వాత 9 నెలల మ్యాచింగ్ గ్రాంట్‌ను ఒకేసారి చెల్లించింది. ఫిబ్రవరి వరకు మ్యాచింగ్ గ్రాంట్ ఫ్రాన్ ఖాతాల్లో జమయిందని మెయిల్స్ రావడంతో సీపీఎస్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ 12 నెలల మ్యాచింగ్ గ్రాంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండేవని, దాని వల్ల లక్షల్లో నష్టపోయే వారిమని ఏపీసీపీఎ్‌సఈఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీశ్, సీఎం దాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
గడచిన 18 ఏళ్లలో జీరో నెలల మ్యాచింగ్ గ్రాంట్ ఉండడం చాలా అరుదంటూ, ఇందుకు సహకరించిన ఏపీజేఏసీ, సీఎం చంద్రబాబుకు 4 లక్షల సీపీఎస్ ఉద్యోగుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కాగా, కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు మంచి జరుగుతుందనడానికి ఇది మంచి ఉదాహరణని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ కార్యదర్శి జి.రామకృష్ణ అన్నారు. డీఏ బకాయిలూ త్వరలోనే జమ చేస్తారని ఆశిస్తున్నామన్నారు.
For More AP News and Telugu News