CPI: కమ్యూనిజానికి చావు లేదు: కూనంనేని

Written by RAJU

Published on:

వనపర్తి టౌన్‌, మార్చి 23: ‘‘మనిషి కి మరణం ఉంటుంది కానీ కమ్యూనిజానికి మరణం ఉండదు’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ శత వసంతాల ఉత్సవాలను ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ.. ‘సృష్టి ఉన్నంత కాలం, సూర్యకిరణాలు ఎర్రగా ఉన్నంత వరకు సీపీఐ ఉంటుందనే విషయం.. కమ్యూనిస్టుల పని అయిపోయిందనుకునే వాళ్లు గుర్తు పెట్టుకోవాలి’ అని పేర్కొన్నారు. పూటకోపార్టీ మారే వాళ్లకంటే.. ఒకే పార్టీ, ఒకే సిద్ధాంతంతో ప్రజల సమస్యలపై పోరాడుతున్న కమ్యూనిస్టులు ఎంతో గొప్ప అని, దీనికి కమ్యూనిస్టులైన ప్రతీ ఒక్కరు గర్వపడాలని అన్నారు.

మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ పుట్టకముందే ఈ దేశంలో హిందూత్వం ఉందని కూనంనేని అన్నారు. చీమలు పెట్టిన పుట్టలోకి పాము దూరినట్లు బీజేపీ ఈ దేశంలో హిందూత్వ ఎజెండాను ఎత్తుకుందన్నారు. రాముడికి, బీజేపీకి సంబంధం లేదని, శ్రీరాముడు జనమందరికీ చెందినవాడని అన్నారు. ‘‘మోసం చేయడంలో, కమ్యూనిస్టులను కరివేపాకులా వాడుకోవడంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు సిద్ధహస్తులే. కానీ, ఇది శాశ్వతం కాదు. భవిష్యత్‌లో కమ్యూనిస్టులదే రాజ్యం’’ అని కూనంనేని అన్నారు. సీపీఐ 100 వసంతాల ముగింపు సభ డిసెంబర్‌ 26న ఖమ్మంలో 5లక్షల మందితో ఘనంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు.

Subscribe for notification