రూ.2500 కోట్లతో కేంద్రం కొత్త కాటన్ మిషన్
ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ యాదవ
గుంటూరు సిటీ, మార్చి 22(ఆంధ్రజ్యోతి): దేశంలో సాగు విస్తీర్ణం పడిపోతున్న పత్తి పంటను ప్రోత్సహించేందుకు కేంద్రం కపాస్ క్రాంతి అనే మిషన్ ప్రవేశపెట్టనున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డీకె యాదవ తెలిపారు. గుంటూరు సమీపంలోని లాం ఫాంలో జరుగుతున్న అఖిల భారత కాటన్ వార్షిక సమావేశానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రూ.2500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన కపాస్ క్రాంతి ద్వారా పత్తి రైతుకు అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలు అందుబాటులోకి తేవడంతో పాటు, ఉత్పాదకత పెంచనున్నట్టు వెల్లడించారు. కపాస్ క్రాంతిలో మూడు మినీ మిషన్లు ఉంటాయని తెలిపారు. ఏటా రూ.500 కోట్లు వ్యయం చేసి పత్తి పంటకు పునర్వైభవం తెచ్చేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రెండో మిషన్‌లో వెయ్యి జిన్నింగ్, ప్రెస్సింగ్ యూనిట్లను ఆధునీకరించే అంశం కూడా ఇందులో నిక్షిప్తమై ఉందని పేర్కొన్నారు. భారత దేశం పురాతన సమన్వయ పరిశోధనా కార్యక్రమాల్లో ఒకటైన ఆలిండియా కోఆర్డినేటెడ్ కాటన్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ప్రాముఖ్యాన్ని ప్రస్తావించారు.
ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 కేంద్రాలు, 190 మంది శాస్త్రవేత్తలతో, సంవత్సరానికి రూ.40 కోట్ల బడ్జెట్‌తో పనిచేస్తోందన్నారు. పత్తి పంట సాగులో డ్రోన్లుతో పాటు ఇతర యాంత్రీకరణ విధానాన్ని ప్రవేశపెట్టాలని డాక్టర్ యాదవ సూచించారు. దేశంలో పత్తి సాగును ప్రోత్సహించేందుకు కస్తూరి కాటన్‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ సమావేశంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న కాటన్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ సీడీ మాయి మాట్లాడుతూ కాటన్ రెండో మిషన్ లక్ష్యాలను నిర్దేశించారు. ప్రతి హెక్టారుకు 850 నుంచి 900 కిలోల లింట్ ఉత్పత్తి లక్ష్యంగా రెండవ మిషన్ పనిచేయాలని అన్నారు. గులాబీ రంగు పురుగు నియంత్రణలో బీటీ సాంకేతికతలు మాత్రమే సరిపోతాయనే భావనను విడనాడాలని సూచించారు. ఇ-డయాగ్నోస్టిక్ విధానాలతో పత్తి సమస్యకు పరిష్కారాలు, సంస్కరణలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ డైరెక్టర్ వైజీ ప్రసాద్, వీసీ శారదా జయలక్ష్మి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పాలడుగు వెంకట సత్యనారాయణ, డాక్టర్ దుర్గా ప్రసాద్, వివిధ రాష్ర్టాలకు చెందిన 160 మంది పత్తి పంట పరిశోధనా శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..
WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News
Updated Date – Mar 23 , 2025 | 04:32 AM