- పెను మార్పుల దిశగా కాంగ్రెస్ పార్టీ..
- డీసీసీలకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు రాహుల్ గాంధీ ఓకే..
- సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు వీకేంద్రీకరణ..

Congress: వరస ఓటములతో కుదేలవుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థాగత పునరుద్ధరణకు పార్టీలో రంగం సిద్ధమవుతుంది. ఇన్నాళ్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(AICC) కేంద్రంగా ఉన్న పార్టీ నిర్మాణాన్ని మార్చాలని భావిస్తున్నారు. వికేంద్రీకరణకు గ్రాండ్ ఓల్డ్ పార్టీ ప్రాధాన్యత ఇస్తోంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ(DCC)లకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలని, వాటికి ప్రాధాన్యత, స్వయం ప్రతిపత్తి ఇవ్వడంతో పాటు బలోపేతం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థాగత మార్పులను పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సమర్థించారు. ఈ మార్పులకు మద్దతు ప్రకటించారు.
1971ల ఇందిరా గాంధీ శకం నుంచి ప్రేరణ పొంది, పార్టీ జిల్లా కాంగ్రెస్ కమిటీలను (డీసీసీ)లను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌ల ఉన్నతస్థాయి సమావేశంలో, రాహుల్ గాంధీ తన దీర్ఘకాలిక సంస్కరణల ఎజెండాలో భాగంగా జిల్లా యూనిట్లకు సాధికారత కల్పించాలని సూచించారు.
Read Also: Annamaya District: భార్యను దారుణంగా హత్య చేసిన భర్త.. ఆపై..
స్థానిక పార్టీ యూనిట్లను బలోపేతం చేయడంపై రాష్ట్ర నాయకుల నుంచి రాహుల్ గాంధీ అభిప్రాయాలను కోరారని, టిక్కెట్ల పంపిణీ, సమస్యల ఎంపికతో సహా పార్టీ వ్యవహారాల్లో జిల్లా అధిపతులకు నిర్ణయాత్మక పాత్ర ఉండాలని ఆయన కోరుకుంటున్నారని జాతీయ మీడియా పేర్కొంది. పార్టీ అట్టడుగు స్థాయి బలాన్ని పునరుద్ధరించడానికి, కోల్పోయిన రాజకీయ స్థానాన్ని తిరిగి పొందడానికి ఇది ఒక వ్యూహంగా భావిస్తున్నారు.
ఈ చర్యల్లో భాగంగా జిల్లా అధ్యక్షులకు పూర్తి అధికారం ఉండేలా కాంగ్రెస్ తన ప్లాన్‌ని సిద్ధం చేస్తోంది. దీనిని అమలు చేయడానికి పార్టీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీలు మార్చి 27-28 , ఏప్రిల్ 3 తేదీలలో ఇందిరా భవన్‌లో మూడు బ్యాచ్‌లలో దాదాపు 750 జిల్లాల అధిపతులతో నేరుగా చర్చించనున్నారు. అభిప్రాయాలు సేకరించిన తర్వాత, ఏప్రిల్ 8న అహ్మదాబాద్ లో జరిగి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో తుది బ్లూప్రింట్‌ను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 9న చర్చించిన తర్వాత అధికారం ఆమోదం తెలుపనున్నారు. 2025-26లో కీలకమైన రాష్ట్ర ఎన్నికలు జరుగనున్న తరుణంలో, ఈ నిర్మాణాత్మక సవరణలు సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేస్తుందని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది.