- రాహుల్ గాంధీపై ఈడీ చర్యలు అన్యాయం
- మోడీ సర్కార్ కక్షపూరితంగా పని చేస్తోంది
- కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తుంది : మీనాక్షి నటరాజన్

Meenakshi Natarajan : నేషనల్ హెరాల్డ్ కేసు చార్జ్‌షీట్‌లో రాహుల్ గాంధీ, సోనియాగాంధీల పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ శ్రేణులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వెంకట్, మాజీ ఎంపీ విహెచ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ తప్పుడు వ్యవహారాలపై పోరాటం చేస్తుందని ప్రకటించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీకి తగిన సందేశాన్ని పంపినట్లు ఆమె తెలిపారు. “బీజేపీని ఓడగొట్టడమే మా లక్ష్యం,” అని ఆమె చెప్పారు.
మీనా నటరాజన్ మాట్లాడుతూ, “మోడీ సర్కార్ కక్షపూరిత రాజకీయాలు చేస్తూ, రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు దేశంలో ఆందోళన పరిస్థితి నెలకొంది. భవిష్యత్తు తరానికి మంచి జరుగుతుందో లేదో అనే భయం ప్రజల మదిలో పెరిగింది.” ఆమె కుంభమేళా సందర్భంలో కూడా కుల వివక్ష చూపించారని మండిపడ్డారు. “హిందూ రాష్ట్రంలో పేద గుడిసెలో నివసించే ప్రజలను చెత్త వేసేదగ్గర, డంపింగ్ యార్డ్ వద్ద ఉంచుతారు. ఈ సమయములో వారు హిందువులా కాకుండా మానవత్వాన్ని కోల్పోతారు,” అంటూ ఆమె అన్నారు.
పేద ప్రజల పక్షాన నిలబడినప్పుడు, కేంద్రం వారిని ఈడీ కేసులతో వేధించడంతో పాటు విచారణలు పెట్టి హరితమైన పరిస్థితులను తయారు చేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కులగణన , ఎస్సీ వర్గీకరణలాగా రాహుల్ గాంధీ దేశమంతటా ఇదే విధానం కోరుకుంటున్నారని ఆమె తెలిపారు. ఈ దేశంలో సమానత్వాన్ని, సామాజిక న్యాయం అందించాలంటే కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆమె అన్నారు.
నేషనల్ హెరల్డ్, ఒక నాన్ ప్రాఫిట్ సంస్థగా, అవినీతి లావాదేవీలు జరపలేదని చెప్పడం వాస్తవమేనని, కానీ ఈడీ మాత్రం మనీలాండరింగ్ కేసులు ఎక్కించేసిందని ఆమె మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితులు గతంలో కూడా ఉండే, అప్పట్లో ఇందిరా గాంధీ పోరాటం చేశారు. ఇప్పుడు మన వంతు అని ఆమె వ్యాఖ్యానించారు.
ట్రంప్ నిర్ణయాలపై మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆయన ట్రంప్ స్నేహితుడే కదా. అయితే, ట్రంప్ నిర్ణయాలతో దేశానికి నష్టం జరుగుతుంటే మోడీ ఎందుకు మాట్లాడకుండానే ఉంటారు? అని ఆమె ప్రశ్నించారు. ధనికుడు అయినా, పేదుడు అయినా, వారి ఓటు విలువ ఒక్కటే అని, సామాజిక న్యాయం అందరికీ సమానంగా అందాలంటే, కొత్త నినాదంతో ముందుకు సాగాలన్నారు అదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆమె తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా పోరాటమని ఆమె ఉద్ఘాటించారు.