Congress: కాంగ్రెస్‌లో ప్రక్షాళన ఇకనైనా జరిగేనా..? రాహుల్ గాంధీ వ్యాఖ్యల మర్మమేంటి..

Written by RAJU

Published on:

“నాతో వచ్చేదెవరు.. యుద్ధం చేసేదెవరు?” అంటూ బాహుబలి సినిమాలో ఓటమి నైరాశ్యంలో ఉన్న సైన్యానికి ధైర్యం చెప్పి కార్యోన్ముఖులను చేసిన సైన్యాధ్యక్షుడి (ప్రభాస్) డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరిస్థితి అలాగే ఉంది. ఓవైపు ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ (BJP) ముప్పేట దాడి చేస్తోంది. కాంగ్రెస్ చేతిలో ఉన్న ఒక్కొక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ ముందుకెళ్తోంది. వరుసపెట్టి ఎన్నికల్లో గెలుపొందుతూ దూసుకెళ్తోంది. చాణక్యుడి రాజనీతితో పాటు అన్ని రకాల యుద్ధతంత్రాలను అమలు చేస్తూ గెలుపే పరమావధిగా ఆ పార్టీలో ప్రతి ఒక్కరూ కలసికట్టుగా శ్రమిస్తున్నారు. కానీ అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి కాంగ్రెస్‌లో నెలకొంది. నేతలకు స్వార్థ ప్రయోజనాలు, పదవులు, తమ గెలుపు తప్ప పార్టీ గెలుపు ముఖ్యం కాదు. కొందరైతే ఉండేది ఇక్కడ (కాంగ్రెస్‌లో), పనిచేసేది మరో పార్టీ కోసం అన్నట్టుగా ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలు ఇచ్చే తాయిలాలకు లొంగిపోయి సొంత పార్టీ ప్రయోజనాలను తాకట్టు పెట్టేస్తున్నారు. ఈ విషయం గ్రహించిన రాహుల్ గాంధీ.. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం చేపట్టిన రెండ్రోజుల కసరత్తులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ఇంతకీ ఏమన్నారంటే!

కాంగ్రెస్ పార్టీలో నెలకున్న పరిస్థితులపై అవగాహన పెంచుకున్న రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్న నేతలు, కార్యకర్తలను గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. “గుజరాత్‌లో మా పార్టీలో రెండు రకాల కార్యకర్తలు ఉన్నారు. మొదటి రకం నిజాయితీగా పార్టీ కోసం శ్రమిస్తూ ప్రజలతో మమేకమై ఉన్నారు. రెండో రకం ప్రజలకు దూరంగా బీజేపీకి దగ్గరగా ఉన్నారు. ఆ పార్టీకి బీ-టీమ్‌గా పనిచేస్తున్నారు” అంటూ ఫైర్ అయ్యారు. గుజరాత్‌లో మూడు దశాబ్దాలుగా అధికారం అందుకోలేకపోవడానికి ఈ కోవర్టులే కారణమంటూ నిందించారు. అలాంటి వారు 10 మంది నుంచి 40 మంది వరకు ఉన్నా సరే.. వాళ్లందరినీ పార్టీ నుంచి తొలగించి ఒక సందేశం పంపాలి అని రాహుల్ వ్యాఖ్యానించారు.

ఇది గుజరాత్‌కే పరిమితమా?

రాజకీయాలు, చరిత్ర కాలంలో యుద్ధాలు ఒకటే. Everything is fair in love & war అని అంటారు. అంటే ప్రేమలో, యుద్ధంలో ఏదైనా సమంజసమే అని దానర్థం. గెలుపు కోసం బీజేపీ వంటి కొన్ని పార్టీలు అన్ని రకాల వ్యూహాలు, యుద్ధ తంత్రాలను అమలు చేస్తుంటాయి. ఆ క్రమంలో ప్రత్యర్థులను తమవైపు తిప్పుకోవడం ఒక వ్యూహం. అలాంటి వ్యూహాలకు సులభంగా చిక్కేది ఎవరంటే.. దేశంలోని కాంగ్రెస్ పార్టీ నేతలే. ఈ పరిస్థితి కేవలం గుజరాత్ వంటి రాష్ట్రానికే పరిమితం కాలేదు. తెలంగాణలోనూ కొందరు నేతలు భారత రాష్ట్ర సమితి (BRS)కు కోవర్టులుగా పనిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ వెతికితే కోవర్టులు చాలా మంది కనిపిస్తారు. పార్టీ గెలిచే అవకాశం లేదన్న నిరాశ, నిస్పృహలు ఆవహించినప్పుడు ఈ తరహా పరిస్థితి ఎక్కువగా తలెత్తుతుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయాలు విపరీతమైన ఖర్చుతో కూడుకున్నాయి. తాను గెలిచినా పార్టీ ఓడితే.. ఎన్నికల్లో పెట్టిన ఖర్చు తిరిగి రాబట్టుకొనే అవకాశం ఉండదు. ఇలాంటప్పుడు అధికారంలోకి ఉన్నవారితో చేతులు కలిపితే కనీసం పెట్టుబడి వెనక్కి వస్తుంది అన్నది కొందరి ఆలోచన. కొందరైతే ఇదంతా ఎందుకని.. ఏకంగా గెలుపొందిన తర్వాత పార్టీ ఫిరాయించి మరీ అధికార పక్షంలో చేరిపోతున్నారు. ఎలాగూ స్పీకర్ అధికారపక్షం నుంచే ఉంటారు కాబట్టి పదవీకాలం పూర్తయ్యేవరకు తమ అనర్హత వేటు వంటి చర్యలు ఉండవన్న భరోసా వారికి ఎలాగూ ఉంటుంది. కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన స్థాయిలో బీజేపీ వంటి సైద్ధాంతికంగా బలంగా ఉన్న పార్టీల నుంచి జరగవు. అంటే కాంగ్రెస్ పార్టీలో తమ నేతలను కట్టిపడేసే సైద్ధాంతిక బలం కూడా లేదని అర్థమవుతోంది.

కోవర్టులే కాదు.. కుమ్ములాటలు వేధించే అంశమే

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అన్న మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది. నిజమే. అది ఏ స్థాయిలో అంటే.. నేతలు పార్టీకి నష్టం కలిగినా ఫర్వాలేదు అన్న స్థాయిలో కుమ్మలాడుకునే స్థాయిలో అక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది. పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ సవాళ్లు, విమర్శలు లేవనెత్తినా సరే అక్కడ చెల్లబాటవుతుంది. ఇటీవల హర్యానా, మహారాష్ట్ర మరియు ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో జరిగిన అనేక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీలో జాతీయస్థాయిలో అంతర్గత కలహాలు, గందరగోళంతో పోరాడుతోందని స్పష్టంగా తెలుస్తుంది. శశి థరూర్ నుంచి ముంతాజ్ అహ్మద్ వరకు చాలా మంది సీనియర్ పార్టీ నాయకులు పార్టీలో తమ పాత్రలతో సంతోషంగా లేరని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.

పార్టీ నాయకులు మాత్రమే కాదు, INDI కూటమి సభ్యులు కూడా రాహుల్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముందు ఇంట నెగ్గి, రచ్చ గెలవాలని.. ఆ క్రమంలో పార్టీలో ప్రక్షాళన చేపట్టి తనవెంట వచ్చే వారిని మాత్రమే ముందుకు తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ చూస్తున్నారు. తన నాయకత్వంపై సందేహాలు వ్యక్తం చేస్తున్న నేతలను వదిలించుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. అందులో భాగమే తాజా హెచ్చరికలని రాజకీయ పండితులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification