తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచ దేశాలకు తెలియజేశారు. జపాన్ పర్యటనలో భాగంగా ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్ పోలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం పాల్గొంది. ఈ ఎక్స్ పోలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్ పోలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ పాలుపంచుకోవటం గర్వంగా ఉందని అన్నారు. జపాన్‌తో ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాలిక భాగస్వామ్యంగా మార్చుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. తెలంగాణ-జపాన్ భాగస్వామ్యంతో భవిష్యత్తు ప్రణాళికలకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం
తెలంగాణ రాష్ట్రంలో సులభతర పారిశ్రామిక విధానం, స్థిరమైన పాలన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్నాయని జపాన్ కంపెనీలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తులు తయారు చేసి భారత మార్కెట్‌తో పాటు ఇతర దేశాలకు ఎగుమతులు చేయవచ్చని జపాన్ కంపెనీలకు సూచించారు. దీంతో తెలంగాణ–జపాన్ సంబంధాలు మరింత బలపడతాయని, ఒసాకా బేలో ఉదయించే సూర్యోదయంలా కొత్త అధ్యాయం తెలంగాణలో ప్రారంభమవుతోందని సీఎం అన్నారు. ఒసాకాతో పాటు ప్రపంచంతో కలిసి నవ ప్రపంచాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఇప్పటికే ఐటీ, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, టెక్స్టైల్స్ రంగాల్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ సమీపంలో 30 వేల ఎకరాల్లో ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణంలో ఉందని, ఇది ఎకో, ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీ ఆధారంగా రూపుదిద్దుకుంటోందన్నారు. ఈ సిటీలో మారుబెని కార్పొరేషన్‌తో కలిసి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రాజధాని సమీపంలో ఓడరేవులతో అనుసంధానించేలా డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది ఎగుమతులకు మార్గాన్ని వేగవంతం చేస్తుందని వెల్లడించారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నది తీరాన్ని అర్బన్ గ్రీన్‌వేగా అభివృద్ధి చేసేందుకు టోక్యో, ఒసాకా నగరాల నుండి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నైపుణ్య శిక్షణతో పాటు క్రమశిక్షణకు అద్దంపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేసిందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఈ యూనివర్సిటీ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను పెంచడంలో కీలకంగా నిలుస్తుందని ఆయన వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…