కుట్రలతో ప్రజా రాజధాని స్వప్నాన్ని చెరిపేయలేరు
విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం
మే 2 రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు కానుంది
అమరావతి సంపద సృష్టి కేంద్రంగా మారుతుంది
అన్ని వర్గాలకూ ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది
‘నా రాజధాని అమరావతి’ అని ప్రతి పౌరుడూ చెప్పుకోవాలి: సీఎం చంద్రబాబు
ప్రధాని సభ ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష
అమరావతి, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు రాజధాని ప్రయాణం సాగనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభ కార్యక్రమంపై చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. బహిరంగ సభ, భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు, దాడులు చేసిందని.. అయితే అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజల అభిలాష మేరకు ప్రారంభమైన అమరావతి అనేక సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని నిలబడిందని అన్నారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనులు మళ్లీ ప్రారంభమవుతున్నాయని, ఆ రోజు రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపు కానుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 10 నెలల్లో గత ప్రభుత్వం కారణంగా తలెత్తిన అన్ని సవాళ్లను పరిష్కరించి, నిలిచిపోయిన రాజధాని పనులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నామని తెలిపారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్ష, సెంటిమెంట్ అని.. దీన్ని ఎవరూ దెబ్బతీయలేరని సీఎం అన్నారు. అమరావతి సంపద సృష్టి కేంద్రంగా.. అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాంతంగా మారుతుందన్నారు.
కుట్రలకు, కుతంత్రాలకు ప్రజారాజధాని బలికాబోదని, ఆంధ్రుల రాజధాని స్వప్నాన్ని ఎవరూ చెరిపివేయలేరని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దేశమంతా గుర్తించేలా రాజధాని పనులను స్వయంగా ప్రధాని చేతుల మీదుగా పునఃప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా.. వేడుకగా నిర్వహించాలని, రాష్ట్రంలో ప్రతి పౌరుడు ‘నాది ఆంధ్రప్రదేశ్.. నా రాజధాని అమరావతి’ అని చెప్పుకొనేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని అన్నారు. ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారని, మొన్న జరిగిన ఢిల్లీ భేటీలో పలు సూచనలు చేశారని సీఎం పేర్కొన్నారు.
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు
ప్రధాని సభ ఏర్పాట్లపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా చూడాలని, ఎండల తీవ్రత దృష్ట్యా దూర ప్రాంతాల నుంచి సభకు వచ్చే వారికి తాగునీరు, ఆహారం అందించాలని సీఎం సూచించారు. భద్రతాపరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా రాజధాని గ్రామాల ప్రజలకు ఈ కార్యక్రమంలో ఎక్కువ భాగస్వామ్యం ఉంటుందని, వారంతా సభకు రావాలని భావిస్తారని, వారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. సమీక్షలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, నారాయణ, నాదెండ్ల మనోహర్, సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా, గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
15 నిమిషాలు రోడ్డు షో.. గంట పాటు సభ
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 3.30 గంటలకు అమరావతిలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.2 కి.మీ. రోడ్డు షోలో పాల్గొంటారు. ఈ రోడ్డు షో 15 నిమిషాలపాటు సాగుతుంది. ఆ తర్వాత అమరావతి విశేషాలతో ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బహిరంగ సభ జరగనుంది. ఈ పర్యటనలో ప్రధాని సుమారు రూ.లక్ష కోట్ల విలువైన రాజధాని పనులకు శంకుస్థాపన చేస్తారు. 5.10 గంటలకు బయలుదేరి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తారు. కాగా, బహిరంగ సభ వద్ద మూడు వేదికలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక వేదికపై ప్రధానితోసహా సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు మొత్తం 20 మంది ఆశీనులవుతారు. మరో వేదికపై 100 మంది ప్రజాప్రతినిధులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు రాజధానికి భూములు ఇచ్చిన 30 మంది రైతులు కూర్చోనున్నారు.
Updated Date – Apr 28 , 2025 | 05:50 AM