
China: ప్రపంచంలో ఎవరూ ఊహించని విధంగా.. చైనా తన అధికారం చూపించేందుకు తీసుకున్న ఓ నిర్ణయం… చివరికి దాని మెడకే చుట్టుకోనుందా? తాత్కాలికంగా డ్రాగన్ కంట్రీ తీసుకున్న ఈ నిర్ణయం.. చైనా దేశస్థులకే శాపంగా మారనుందా? ఇతర దేశాలకు అరుదైన మూలకాలు, లోహాలు, మ్యాగ్నెట్ల ఎగుమతులను నిలిపివేసిన చైనా.. తన సమాధిని తానే తవ్వుకుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి..! ఇంతకీ చైనా నిర్ణయం తర్వాత ఏం జరగనుంది?
అరుదైన లోహాలు అనేవి టెక్నాలజీ ప్రపంచానికి రక్తం లాంటివి. ఇవి లేకుండా ఎలక్ట్రిక్ కార్లు, రాకెట్లు, కంప్యూటర్ చిప్‌లు, డిఫెన్స్ డ్రోన్లు లాంటివి తయారు చేయలేం. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉపయోగించే మ్యాగ్నెట్లలో ఈ లోహాలే ఉంటాయి. టెస్లా కార్లలో వాడే సూపర్ స్ట్రాంగ్ మ్యాగ్నెట్లు కూడా వీటితోనే తయారవుతాయి. మిలిటరీ వాహనాలు, డ్రోన్లు, రాడార్‌ల లాంటివి కూడా ఈ లోహాలు లేకుండా పనిచేయవు. అంటే.. ఈ లోహాల సరఫరాలో చిన్న అంతరాయం వచ్చినా… మొత్తం టెక్నాలజీ పరిశ్రమ షేక్ అవుతుంది. అందుకే చైనా సరఫరా ఆపేసినట్టు చెప్పినప్పటి నుంచి ప్రపంచం మొత్తం ఉత్కంఠగా చూస్తోంది. నిజానికి చైనా ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలానే చేసింది. 2010లో కూడా జపాన్‌పై కోపంగా తన ఎగుమతులు ఆపేసింది. అప్పుడు జపాన్‌కి కాస్త నష్టం జరిగింది కానీ.. పరిస్థితిని మాత్రం వెంటనే చక్కదిద్దుకుంది. ఏడాదికి సరిపడా స్టాక్ నిల్వ చేసుకుంది. ఇప్పుడు అదే జాగ్రత్త అమెరికా కూడా తీసుకుంటే చైనాకు చావు దెబ్బ తప్పదు!
చైనా తీసుకున్న ఈ నిర్ణయం.. అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు చైనాకే నష్టం కలిగించనుంది. ఎందుకంటే ఈ అరుదైన లోహాల ప్రాసెసింగ్‌లో ప్రపంచంలో 90 శాతం కంటే ఎక్కువ దేశాలు చైనాపైనే ఆధారపడి ఉన్నాయి. అంటే ఈ వ్యాపారమే చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద బలం . ఇప్పుడు ఎగుమతులు ఆపేస్తే, వీటిని కొనే దేశాలు వేరే మార్గాల చూసుకుంటాయి. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా లాంటి దేశాలు తమ నిక్షేపాలపై దృష్టిపెట్టాయి. కొన్ని మైన్స్ ఓపెన్ చేయడానికి పనులు కూడా మొదలయ్యాయి. ఇవన్నీ ఒక ట్రాక్‌లో వచ్చేస్తే.. అప్పుడు చైనా తయారుచేసే మ్యాగ్నెట్లకు, లోహాలకు డిమాండ్ పడిపోతుంది. దీనివల్ల అక్కడి పరిశ్రమలు నష్టపోతాయి. ఉద్యోగాలు తగ్గుతాయి. అంతే కాదు.. చైనా ఏదైనా దేశాన్ని టార్గెట్ చేయాలని చూస్తే.. మిగతా దేశాలు చైనాపై భారీ టారిఫ్‌లు విధిస్తాయి. దీని ప్రభావం ఊహించని స్థాయిలో చైనా ఎకానమీపై పడే ప్రమాదం ఉంది.
నిజానికి ఈ ఒక్క నిర్ణయంతో చైనా ప్రతిష్ట మసకబారుతుందనే చెప్పవచ్చు. ఇప్పటివరకు చైనాను ఎన్నో దేశాలు నమ్ముతూ వచ్చాయి. ట్రస్టెడ్ పార్ట్‌నెర్ అంటూ చైనాను ఎన్నోసార్లు మెచ్చుకున్నాయి కూడా. కానీ ఇప్పుడు అదే దేశాలు వెనక్కి అడుగులు వేస్తున్నాయి. వ్యాపార విషయాల్లో రాజకీయ భావజాలాన్ని కలుపుతున్న చైనా తీరు వారికి ఏ మాత్రం నచ్చడంలేదు. కేవలం అమెరికాపై ప్రతీకారం సాకుతో ఇతర దేశాలను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అని ఇతర దేశాలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి వ్యాపార సంబంధాల్లో నమ్మకం అన్నది కేవలం డబ్బుపై ఆధారపడిన విషయం కాదు.. అది దశాబ్దాల స్నేహానికి, నమ్మకానికి చిహ్నం. ఇప్పుడు ఆ నమ్మకాన్ని చెరిపేసే విధంగా వ్యవహరిస్తే… దాని మూల్యాన్ని చైనానే భరించాల్సి ఉంటుంది.