ABN
, Publish Date – Apr 24 , 2025 | 05:30 AM
చర్లపల్లి జైలు పారిశ్రామిక యూనిట్‌లో ఫినాయిల్, సబ్బుల విక్రయాల్లో రూ.25 లక్షల మేర గోల్‌మాల్ వెలుగులోకి వచ్చింది. డీజీ సౌమ్యా మిశ్రా ఆదేశాలతో ఐదుగురు అధికారుల కమిటీ విచారణ ప్రారంభించింది.

చర్లపల్లి జైలు పారిశ్రామిక యూనిట్‌లో రూ.25 లక్షల గోల్‌మాల్
క్యాంటీన్‌లో లెక్కల్లోలేని రూ. 7 లక్షలు…
పెట్రోల్ బంకు డబ్బుల్లోనూ తేడా.. విచారణకు ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): చర్లపల్లి కేంద్ర కారాగారం పారిశ్రామిక యూనిట్‌లో పెద్ద మొత్తంలో అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఖైదీల ప్రవర్తనలో మార్పు తెచ్చి, జైలు నుంచి విడుదలైన తర్వాత వారి జీవనోపాధి పొందేందుకు వీలుగా పారిశ్రామిక యూనిట్‌లో వారితో పనిచేయిస్తుంటారు. ఖైదీలు తయారు చేసిన వస్తువులను బయటి మార్కెట్‌లో విక్రయించి అధికారులు పెద్ద మొత్తంలో దారిమళ్లించారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆ శాఖ డీజీ విచారణకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జైళ్లల్లో ఖైదీలు తయారు చేసే వస్తువులకు బయటి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. డిమాండ్ మేరకు ‘మై నేషన్’ బ్రాండ్ పేరుతో ఖైదీలు తయారు చేసిన వస్తువులను అధికారులు బయటి మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. చర్లపల్లి సెంట్రల్ జైలు పారిశ్రామిక యూనిట్‌లో ఖైదీలు తయారు చేసిన ఫినాయిల్, సబ్బులు, చేతి రుమాలు, టవళ్లు, ఇనుప వస్తువులు, ఫర్నీచర్ ఇతర సామగ్రి మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. గతంలో జైలు సూపరింటెండెంట్‌గా పనిచేసిన అధికారి హయాంలో పారిశ్రామిక యూనిట్‌లో లెక్కల్లో సుమారు రూ. 25 లక్షల మేర తేడా ఉన్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారు.
క్యాంటిన్‌లో రూ.7 లక్షలకుపైగా గోల్‌మాల్ జరిగినట్లు తేలింది. చర్లపల్లి జైలు ఆధ్వర్యంలో కొనసాగే పెట్రోల్ బంకు ఆదాయంలోనూ పెద్దమొత్తంలో తేడా జరిగినట్లు తేలింది. విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్న జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా నిధుల గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరిపేందుకు ఐదుగురు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసారు. వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక అందజేయాలని కమిటీని ఆదేశించారు. డీజీ ఆదేశాల మేరకు బుధవారం మొదటి రోజు కమిటీ చర్లపల్లి జైలును సందర్శించి విచారణ మొదలు పెట్టింది. రికార్డుల పరిశీలించింది. కాగా చర్లపల్లి జైలు పారిశ్రామిక యూనిట్‌లో నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో స్టాక్ బుక్ కీలకంగా మారనుంది. యూనిట్‌లో వస్తువుల తయారీకి సంబంధించిన సమాచారం మొత్తం స్టాక్ బుక్‌లో నమోదు చేస్తారు. స్టాక్ బుక్‌లో నమోదు చేసిన వస్తువులు, బయట విక్రయం ద్వారా వచ్చిన డబ్బుల లెక్కసరిగా ఉండాలి. కానీ పెద్ద మొత్తంలో గోల్‌మాల్ నేపథ్యంలో స్టాక్ బుక్‌లో నమోదు చేసిన వస్తువుల వివరాలు, ఆ సమయంలో వచ్చిన డబ్బుల డిపాజిట్‌పైన కమిటీ ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది.
వరుస పరిణామాలపై డీజీ సిరియస్….
జైళ్లల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాల పట్ల డీజీ సౌమ్యా మిశ్రా అధికారుల తీరుపట్ల సీరియ్‌సగా ఉన్నారు. ఇటీవల కీలక అధికారులతో సమావేశం నిర్వహించిన సమయంలోనూ వారి తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. జైళ్ల శాఖలో జరుగుతున్న కొన్ని విషయాలు డీజీ దృష్టికి అధికారులు తీసుకెళ్లకపోవడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Updated Date – Apr 24 , 2025 | 05:30 AM