- కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లో మొబైల్స్, కెమెరాలపై నిషేధం..
- రీల్స్, యూట్యూబ్ కంటెంట్ చేస్తే కఠిన చర్యలు..
- భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు..

Char Dham Yatra 2025: యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ల ‘‘చార్ ధామ్’’ యాత్ర మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ఏర్పాట్లను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ యాత్ర కోసం 9 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. కేవలం ఆరు రోజుల్లోనే 9 లక్షల మంది నమోదు చేసుకున్నారు. కేదార్‌నాథ్ కి 2.75 రిజిస్ట్రేషన్లు, బద్రీనాథ్‌కి 2.2 లక్షల రిజిస్ట్రేషన్లు, గంగోత్రికి 1.38 లక్షలు, యమునోత్రికి 1.34, హేమకుండ్ సాహిబ్‌కి 8000 రిజిస్ట్రేషన్లు వచ్చాయి.
ఇదిలా ఉంటే, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రీల్స్, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లపై నిషేధాన్ని విధిస్తున్నారు. కేదార్‌నాథ్-బద్రీనాథ్ పాండా సమాజ్ ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లు, కెమెరాలతో వీడియోలు తీస్తూ రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేసే వారికి దర్శనాన్ని నిరాకరించి తిరిగి పంపించేస్తామని పేర్కొంది.
Read Also: Aman Sweets : మల్లాపూర్ అమన్ స్వీట్స్ ఫ్యాక్టరీ సీజ్.. గడువు ముగిసిన స్వీట్లతో మళ్లీ తయారీ!
మరోవైపు, కేదార్‌నాథ్ ఆలయానికి 30 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు, కెమెరాలను నిషేధించాలని ఆలయ కమిటీ ఆదేశించింది. ఏ భక్తుడు కూడా సోషల్ మీడియాలో వీడియో కంటెంట్ క్రియేట్ చేయకుండా ఉండేందుకు దీనిని అమలు చేయనున్నారు. భక్తుల యాత్ర శాంతియుతంగా ఎలాంటి వివాదాలు లేకుండా ముగిసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కేదార్‌నాథ్ ప్రాంగణంలో లవ్ ప్రపోజ్ చేసుకుంటూ ఓ జంట వీడియో తీయడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించేందుకు ఐటీబీటీ సిబ్బంది, పోలీసుల్ని మోహరించనున్నారు.
ఏప్రిల్ 30 (అక్షయ తృతీయ) నుండి గంగోత్రి మరియు యమునోత్రి ఆలయ తలుపులు తెరవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. మే 2న, కేదార్‌నాథ్ తలుపులు తెరవబడతాయి, తరువాత మే 4న బద్రీనాథ్ తలుపులు తెరవబడతాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ యాత్ర సజావుగా సాగేందుకు హరిద్వార్, రిషికేష్, బ్యాసీ, శ్రీనగర్, రుద్ర ప్రయాగ్, సోన్ ప్రయాగ్, వికాస్ నగర్, బార్కోట్, భట్వారీ,హెర్బర్ట్‌పూర్ వంటి 10ప్రాంతాల్లో యాత్రికుల కోసం హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో యాత్రికులకు ఆలస్యమైన సమయంలో సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన బసను నిర్ధారించడానికి నీరు, మరుగుదొడ్లు, పరుపులు, మందులు మరియు అత్యవసర ఆహార సామాగ్రి వంటి అవసరమైన సౌకర్యాలను అందిస్తాయి. మొత్తం యాత్ర మార్గాన్ని 10 కిలోమీటర్ల సెక్టార్‌లుగా విభజించారు, అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సహాయం చేయడానికి మోటార్‌సైకిళ్లపై ప్రతి సెక్టార్‌లో ఆరుగురు పోలీసు సిబ్బంది గస్తీ తిరుగుతున్నారు.