Chandrababu Naidu Management: చంద్రబాబు.. శక్తిమంతమైన నేత!

Written by RAJU

Published on:

అఖిల భారత నాయకుల జాబితాలో14వ స్థానం

జైల్లో పెట్టినా… దీక్షతో అధికారంలోకి.. ‘స్వర్ణాంధ్ర 2047’

విజన్‌ దిశగా అడుగులు.. కొనియాడిన ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’

73వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్‌.. ఇద్దరి ఎంపిక తొలిసారే

నంబర్‌ 1 స్థానంలో మోదీ.. టీ-సీఎం రేవంత్‌కు 28వ స్థానం

హైదరాబాద్‌/అమరావతి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన నాయకుల జాబితాలో సీఎం చంద్రబాబు 14వ స్థానంలో నిలిచారు. రాజకీయ వ్యూహాలు, మొక్కవోని దీక్ష, భవిష్యత్‌పై పక్కా ప్రణాళిక, రాష్ట్రాన్ని ముందువరుసలో నిలపాలన్న విజన్‌ వంటివి ఆయనకు ఈ స్థానాన్ని కట్టబెట్టాయి. దేశంలోని వివిధ రంగాల్లో అత్యంత శక్తిమంతులైన 100మంది ప్రముఖులతో ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌-2025’ జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ 73వ స్థానంలో నిలిచారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ గతంలోనూ ఇలాంటి జాబితా రూపొందించినా.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పేర్లను తొలిసారి తాజా జాబితాలో పేర్కొనడం విశేషం. ఇక, ఈ జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి 28వ స్థానంలో నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నంబర్‌ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నారు. నిరుడు కూడా ఆయన 1వ స్థానంలోనే ఉండటం గమనార్హం. రెండోస్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, మూడో స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ నిలిచారు. తర్వాత(పది స్థానాల్లో) వరసగా ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అశ్వినీ వైష్ణవ్‌, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఉన్నారు. 100 మంది జాబితాలో దేశంలోని రాజకీయ, వ్యాపార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్నారు. సినీ నటుడు అల్లు అర్జున్‌ 92వ స్థానంలో నిలిచారు.

ఒక కృషి-ఒక పట్టుదల!

ఈ జాబితాలో సీఎం చంద్రబాబుకు 14వ స్థానం దక్కడంపై ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పలు కీలక విషయాలను వెల్లడించింది. వ్యూహాత్మక రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరని తెలిపింది. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్‌ జైల్లో పెట్టినప్పటికీ మొక్కవోని దీక్షతో కేవలం ఏడాది కాలంలోనే పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగారని పేర్కొంది. బీజేపీ, జనసేనలతో కూటమికట్టి కనీవినీ ఎరుగని విజయం దక్కించుకున్నారని, ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి చంద్రబాబు వెన్నుదన్నుగా ఉన్నారని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ వివరించింది. ప్రస్తుతం జాతీయస్థాయిలోనూ చంద్రబాబు ముఖ్య భూమిక పోషిస్తున్నారని తెలిపింది. ‘స్వర్ణాంధ్ర 2047’ సాకారం దిశగా చంద్రబాబు పట్టుదలతో ముందుకు సాగుతున్నట్టు పేర్కొంది. అదేవిధంగా ఎన్నికల హామీలైన ‘సూపర్‌-6’ అమలుకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపింది. ఇక, పాలనలో పారదర్శకతకు పెట్టపీట వేస్తూ.. తన మంత్రులకు, తనకు కూడా ఫైళ్ల పరిష్కారంలో ఆయన ర్యాంకులు కేటాయించుకున్న విధానాన్ని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ప్రధానంగా ప్రశంసించింది.

అపజయాల బాటలో విజయతీరాలకు..

జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌-2025’ జాబితాలో 73వ స్థానాన్ని పొందారు. ఆయన గురించి ప్రస్తావిస్తూ.. అపజయాల బాటలో విజయతీరాలకు చేరిన అలుపెరుగని నాయకుడిగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అభివర్ణించింది. 2014లో పార్టీ పెట్టినా ఆయన రాజకీయాలు వడ్డించిన విస్తరి కాలేదని పేర్కొంది. అధికారం కోసం సుదీర్ఘకాలం ఎదురు చూశారని తెలిపింది. 2024లో కూటమి కట్టి వైసీపీని గద్దె దించడంలో కీలక పాత్రపోషించినట్టు వివరించింది.

Also Read:

42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..

మోదీజీ… తమిళనాడుతో పెట్టుకోవద్దు

కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date – Mar 29 , 2025 | 04:37 AM

Subscribe for notification
Verified by MonsterInsights