Chandrababu Mannequin Village: ఇది నారా వారి ఊరు

Written by RAJU

Published on:

  • సీఎం సొంతూరులో సర్వతోముఖాభివృద్ధి

  • జడ్పీ హైస్కూలులో ఐఐటీ మద్రాసు పాఠాలు

  • యువతకు నచ్చిన అంశాల్లో నైపుణ్య శిక్షణ

  • పల్లెలో ప్రతి ఇంటిపైనా సోలార్‌ ప్యానెల్‌

  • గడపగడపకూ తాగునీరు, వంట గ్యాస్‌

  • ఈజీమార్ట్‌తో పల్లె దుకాణాల ఒప్పందం

  • వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కోసం కామన్‌ వర్క్‌ స్టేషన్‌

  • స్వర్ణయుగం దిశగా నారావారిపల్లి అడుగులు

అదొక మారుమూల పల్లెటూరు..! కానీ అక్కడి జిల్లా పరిషత్‌ హైస్కూలు విద్యార్థులకు ఐఐటీ మద్రాసు నిపుణులు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారు. ఆ పల్లెలోని దుకాణాలకు ఈజీమార్ట్‌ సరుకులు చేరవేస్తోంది. కోరుకున్న రంగంలో యువతకు శిక్షణ.. ప్రతి ఇంటిపైనా సోలార్‌ ప్యానెళ్లు.. గడపగడపకూ తాగునీరు, వంట గ్యాస్‌.. ఎటుచూసినా సిమెంటు, తారు రోడ్లు.. ఎక్కడికి వెళ్లాలన్నా కాలుష్య రహిత ఎలక్ర్టిక్‌ ఆటోలు… వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగుల కోసం కామన్‌ వర్క్‌ సెంటర్‌, విద్యార్థుల కోసం స్టడీ సెంటర్‌… ఇలా ప్రతి రంగంలోనూ అభివృద్ధికి చిరునామాగా మారుతున్న ఆ మారుమూల ప్రాంతం స్వర్ణయుగం దిశగా అడుగులు వేస్తోంది. అదే.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని సీఎం చంద్రబాబు జన్మస్థలమైన నారావారిపల్లి. సీఎం ఇప్పుడు స్వగ్రామ సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించారు. దీంతో నారావారిపల్లి రూపురేఖలు సమూలంగా మారిపోతున్నాయి.

(తిరుపతి – ఆంధ్రజ్యోతి)

శేషాచల పర్వతాల పాద భాగంలో పచ్చటి పంటపొలాలు, అడవుల నడుమ ఆవిర్భవించిన నారావారిపల్లె ఒక చిన్న పల్లెటూరు..! తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె పంచాయతీలో ఓ మజరా గ్రామం. చంద్రబాబు గతంలో 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న సమయంలో టీటీడీ కల్యాణ మండపం, కమ్యూనిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయించారు. గతేడాది నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక నారావారిపల్లె అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించడంతో తిరుపతి కలెక్టర్‌ రంగంలోకి దిగారు. ఇంటింటి సర్వే చేపట్టి కుటుంబాల సమగ్ర వివరాలు సేకరించి ఆ సమాచారం సీఎం ముందుంచారు.

ఆయన సూచనలతో స్వర్ణ నారావారిపల్లె పేరిట సమగ్ర ప్రణాళిక రూపుదిద్దుకుంది. అందులో భాగంగా చంద్రగిరి మండలం కందులవారిపల్లె, ఎ.రంగంపేట, చిన్నరామాపురం పంచాయతీల పరిధిలోని 31 మజరా గ్రామాలను క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. క్లస్టర్‌ పరిధిలో 2,007 ఇళ్లలో.. 2,160 కుటుంబాలకు చెందిన 5,960 మంది జనాభా ఉన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు కుటుంబాల అవసరాలు తీర్చేందుకూ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఈ 2,160 కుటుంబాల్లో 1,830 కుటుంబాలకు సొంత ఇళ్లున్నాయి. 286 కుటుంబాలకు లేవని గుర్తించగా నిబంధనల రీత్యా అర్హత కలిగిన 242 కుటుంబాలకు పీఎంఏవై కింద పక్కా గృహాలు మంజూరు చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి అప్పగిస్తారు. వ్యక్తిగత మరుగుదొడ్ల సదుపాయం లేని 35 కుటుంబాలకు కొద్ది రోజుల్లో వాటిని నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్లస్టర్‌ పరిధిలో 1,202 మందికి వివిధ రకాల పెన్షన్లు అందుతున్నాయి. 137 మంది అర్హులకు మంజూరు కాలేదని గుర్తించారు. 97 మందికి గత నెలలోనే పెన్షన్లు మంజూరు చేశారు. మిగిలిన వారికీ త్వరలో ఇచ్చే ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్లస్టర్‌ పరిధిలో 87 కుటుంబాలకు తాగునీటి కొళాయి కనెక్షన్లు లేవని సర్వేలో గుర్తించారు. వాటిలో ఇప్పటికే 20 కుటుంబాలకు కనెక్షన్లు ఇవ్వగా.. మిగిలిన వారికి సెప్టెంబరులోపు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 286 కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లు లేవని తేలగా వారందరికీ వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చేశారు.

ప్రతి ఎకరం బిందు సేద్యం పరిధిలోకి..

300 మంది రైతులు 1,104 ఎకరాలు సాగు చేస్తున్నారు. అందులో అత్యధికంగా మామిడి పంట ఉంది. ఈ మొత్తం వ్యవసాయ భూమిని డ్రిప్‌ ఇరిగేషన్‌ పరిధిలోకి తేవాలని సీఎం ఆదేశించారు. ఈ 3నెలల్లోనే 21 మందికి చెందిన 43.5 ఎకరాలకు డ్రిప్‌ సదుపాయం కల్పించారు. పంటలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించే ఉద్దేశంతో ఫార్మర్స్‌ ప్రొడ్యూజ్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటికే అందులో 250 మంది రైతులు చేరారు. వీరి ఉత్పత్తుల కోసం ఇప్పటి వరకూ దేశంలో పెద్దగా అమలులో లేని ట్రేసబిలిటీ క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. పాడి ఆవుల రక్షణ కోసం గోకులాల పేరిట రూ.2.02 కోట్ల నిధులతో 103 షెడ్లు మంజూరు కాగా.. 87 షెడ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలినవి కొద్ది రోజుల్లో పూర్తి కానున్నాయి. నారావారిపల్లి క్లస్టర్‌లో రోజువారీ పాల ఉత్పత్తి 5,800 లీటర్లు.

రూ. 155 కోట్లతో అభివృద్ధి పనులు

నారావారిపల్లె క్లస్టర్‌లో రూ.155 కోట్లతో అభివృద్ధి పనులు ప్రతిపాదించగా వాటిలో కొన్ని మంజూరయ్యాయి. ఎ.రంగంపేట నుంచి నారావారిపల్లె మీదుగా భీమవరం ఆర్‌అండ్‌బీ రోడ్డు మరమ్మతులకు రూ.16 కోట్లు మంజూరయ్యాయి. గ్రామాల్లో రూ.3.14 కోట్లతో 16 సీసీ రోడ్లు మంజూరయ్యాయి. రూ.6.73 కోట్లతో అవసరమైన చోట్ల డ్రైన్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. ఇప్పటికే ఉన్న ఐదు ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల పునరుద్ధరణకు రూ.25 లక్షలు మంజూరయ్యాయి. క్లస్టర్‌ పరిధిలోని 31 హ్యాబిటేషన్లకూ తాగునీరు అందించడానికి రూ. 9.30 కోట్లతో తాగునీటి పథకానికి ప్రతిపాదనలు పంపించారు. మరోవైపు రూ.120 కోట్లతో హంద్రీనీవా కాలువ నుంచి కళ్యాణి డ్యామ్‌కు, మూలపల్లి చెరువుకు నీరందించే భారీ పథకాన్ని ప్రతిపాదించారు. ఈ నీటితో నారావారిపల్లె పరిధిలోని మొత్తం 1,104 ఎకరాలకు సాగునీరందించే ప్రయత్నం జరుగుతోంది.

యువతకు ఉపాధి కోసం శిక్షణ

ఇంటింటి సర్వేలో భాగంగా యువత ఏ రంగంలో శిక్షణ కావాలని కోరుకుంటున్నారో గుర్తించి.. వారికి శిక్షణ కల్పిస్తున్నారు. దానికోసం నారావారిపల్లిలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ గ్రామాల పరిధిలోని 35 మంది మహిళలకు జ్యూట్‌ బ్యాగ్‌, ఎంబ్రాయిడరీలలో శిక్షణ ఇచ్చారు. తిరుపతికి చెందిన నారీ ఎన్‌జీవోతో ఒప్పందం కుదిర్చారు. జూడియో సంస్థ మెటీరియల్‌ ఇస్తే మహిళలు దుస్తులు, కవర్లు కుట్టిచ్చేలా ఒప్పందం కుదిరింది. మరో 33 మంది యువతీయువకులకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. 449 మంది సభ్యులున్న 45 మహిళా సంఘాలకు గత మూడు నెలల్లోనే రూ.6.50 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఆ రుణాల ద్వారా 15 మంది మహిళలకు ఎలక్ట్రిక్‌ ఆటోలు అందజేశారు. వాటికి అవసరమైన రీఛార్జింగ్‌ స్టేషన్‌ కూడా నారావారిపల్లెలో ఏర్పాటు చేస్తున్నారు. క్లస్టర్‌ పరిధిలోని 7 దుకాణాలకు ఈజీమార్ట్‌తో ఒప్పందం కుదిర్చారు. దుకాణదారులు సరుకుల కోసం తిరుపతికి రాకుండా ఈజీమార్ట్‌ ద్వారా సరుకులు నేరుగా దుకాణాలకు చేరుతున్నాయి.

ప్రతి ఇంటికీ సౌర విద్యుత్‌

క్లస్టర్‌ పరిధిలో 2,007 ఇళ్లకు పైకప్పులపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయడానికి అవకాశముందని సర్వేలో తేలింది. రూ.12.63 కోట్ల అంచనాతో అన్ని ఇళ్లపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 800 ఇళ్లపై ప్యానెల్స్‌ ఏర్పాటు చేశారు. అన్నీ ఏర్పాటు చేస్తే ఏటా రూ.4.86 కోట్ల విలువైన 57.74 లక్షల యూనిట్లు ఉత్పత్తి అవుతుందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది.

రంగంపేట స్కూలులో మద్రాసు ఐఐటీ పాఠాలు

ఎ.రంగంపేట జిల్లా పరిషత్‌ హైస్కూలుకు మహర్దశ పడుతోంది. సీఎం ఆసక్తితో ఈ స్కూలును శ్రీసిటీ యాజమాన్యం కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. 181 మంది చదువుతున్న ఈ బడిలో కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్‌, సైన్స్‌, మ్యాథ్స్‌, ఇంగ్లీష్‌ ల్యాబ్‌లు ఏర్పాటు కానున్నాయి. ఫారిన్‌ లాంగ్వేజెస్‌ నేర్పించే ప్రతిపాదనలూ ఉన్నాయి. సీఎంవో, శ్రీసిటీల చొరవతో ఇప్పటికే మద్రాసు ఐఐటీ నిపుణులు 3 నెలలుగా ఇక్కడి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు చెబుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులను గుర్తించి స్కూల్లో చేర్పిస్తారు. నారావారిపల్లె పరిధిలోని పది ప్రాథమిక పాఠశాలల్లో కూడా మౌలిక వసతులు కల్పించనున్నారు.

ఈ ఆటోతో రోజుకు వెయ్యి సంపాదిస్తున్నా

స్వర్ణ నారావారిపల్లె క్లస్టర్‌ పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ ఆటోను ప్రభుత్వం సబ్సీడితో ఇచ్చింది. రూ.3.50 లక్షల విలువ గల ఈ ఆటో 1.50 లక్షలు రాయితీ ఇచ్చారు. దీంతో రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నారు. సీఎం చంద్రబాబు వలన బతుకుతెరువు లభించింది.

– దూపాగు శివ, చిన్నరామాపురం గ్రామం

Untitled-4 copy.jpg

స్వయం ఉపాధి కల్పన గొప్ప అవకాశం

మహిళలకు స్వయం ఉపా ధి కల్పనకు ఉచితంగా టైలరింగ్‌, మహిళలకు డ్రైవింగ్‌, ఎంబ్రాయిడరింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే తపన చాలా గొప్ప విషయం.

– మౌనిక, భీమవరం

మా గ్రామాలకు గొప్ప వరం

మా గ్రామాలను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం మూడు సచివాలయాల ప్రజలకు గొప్ప వరంగా భావిస్తున్నాం. సీఎం ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా అభివృద్ధి చెందుతామనే నమ్మకం ఉంది.

– కుసుమ, శేషాపురం

కుటుంబ సభ్యుల్లా ప్రోత్సహిస్తున్నారు

ప్రభుత్వ అధికారులు మమ్మ ల్ని కుటుంబ సభ్యుల్లా ప్రోత్సహిస్తున్నారు. మేం అ భివృద్ధి చెందాలని సాయశక్తులా కృషి చేస్తున్నారు. రోజూ మాతో మాట్లాడుతూ మనోధైర్యం ఇస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆశయాలను నారావారిపల్లె క్లస్టర్‌ పరిధిలోని ప్రజలందురూ పాటిస్తే కచ్చితంగా అభివృద్ధి చెందుతాం.

– ప్రశాంతి, నారావారిపల్లె

Updated Date – Apr 01 , 2025 | 04:45 AM

Subscribe for notification
Verified by MonsterInsights