- వక్ఫ్ బిల్లుపై స్టేకి వ్యతిరేకంగా కేంద్రం వాదనలు..
- సుప్రీంకోర్టులో చట్టాన్ని గట్టిగా సమర్థించిన కేంద్రం..

Waqf Act: కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం అమలుపై పాక్షికంగా లేదా పూర్తిగా స్టే విధించడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకి తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం దాఖలు చేసిన పిటిషన్‌లో.. ఇలాంటి కేసుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చట్టబద్ధమైన నిబంధనల్ని నిలిపేసే అధికారం కోర్టులకు లేదని, చట్టంలో అలా లేదని ప్రభుత్వం వాదించింది.
‘‘పార్లమెంట్ చేసిన చట్టాలకు రాజ్యాంగబద్ధత ఉంది. మధ్యంతర స్టే అనేది అధికారాల సమతుల్యత సూత్రానికి విరుద్ధం’’ అని పేర్కొంది. ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ సిఫార్సులపై చట్టాన్ని రూపొందించామని, ఆ తర్వాత పార్లమెంట్ ఉభయ సభల్లో విస్తృత చర్చ జరిగిందని సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది. ‘‘సుప్రీంకోర్టు నిస్సందేహంగా చట్టం యొక్క రాజ్యాంగబద్ధతను పరిశీలించే అధికారాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఈ మధ్యంతర దశలో ఏదైనా నిబంధనల అమలుకు వ్యతిరేకంగా నిషేధం విధించడం దేశంలోని వివిధ శాఖల మధ్య సున్నితమైన అధికార సమతుల్యతను ఉల్లంఘించడమే అవుతుంది’’ అని కేంద్రం తెలిపింది. ఈ కేసులో పిటిషన్లు ‘‘ ఏ వ్యక్తిగత కేసులోనూ అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయవు’’ అందువల్ల మధ్యంతర ఉత్తర్వు ద్వారా రక్షణ కోరవద్దని ప్రభుత్వం వాదించింది.
Read Also: Illicit Affair: తల్లి, కుమారుడి దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర బోర్డుల్లో ముస్లింయేతరులను నియమించడం, ఇస్లాంను ఆచరించే వారు మాత్రమే విరాళాలు ఇవ్వచ్చనే చట్టంలోని నియమాలను సవాల్ చేస్తూ పిటిషన్లు వచ్చాయి. పిటిషనర్లు ఇవి బహుళ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని వాదించారు. అయితే, శుక్రవారం కేంద్రం వాదిస్తూ.. వక్ఫ్ కౌన్సిల్‌లోని 22 మంది సభ్యులలో ఇద్దరు ముస్లిమేతరులను చేర్చడం సమ్మిళితత్వానికి ఉదాహరణ అని, వక్ఫ్ పరిపాలనలో చొరబాటు కాదని స్పష్టం చేసింది.
అయితే, ఈ పిటిషన్లను విచారిస్తూ..ముస్లింలను హిందూ బోర్డు్ల్లోకి ఆహ్వానిస్తారా..? అని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు గత విచారణలో కొత్తచట్టంపై మధ్యంతర స్టేని పరిశీలిస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతానికి వక్ఫ్ బోర్డుల్లో నియామకాలు ఉండవని, ప్రస్తుత స్థితిలో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది.