సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విద్యార్థులకు షాకిచ్చే మార్పులను ప్రకటించింది. 2025-26 విద్యా సంవత్సరానికి 10వ, 12వ తరగతులకు కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో 10వ తరగతి విద్యార్థులకు ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు CBSE తెలిపింది. సామర్థ్య ఆధారిత ప్రశ్నలను పెంచడం, పునఃపరిశీలన ప్రక్రియను మెరుగుపరచడం వంటి ప్రధాన మార్పులను బోర్డు ప్రతిపాదించింది. దీంతోపాటు కొత్త సిలబస్‌లో బోర్డు పరీక్ష 2026 కోసం బోధనా కంటెంట్, అభ్యాస ఫలితాలు, సిలబస్‌పై పలు మార్గదర్శకాలను ప్రకటించింది.
పరీక్షలు సంవత్సరానికి రెండుసార్లు
CBSE 10వ తరగతి బోర్డు పరీక్షలు 2025-26 విద్యా సంవత్సరం నుంచి రెండుసార్లు జరుగుతాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి, ఏప్రిల్‌లలో జరగనున్నాయి. కానీ CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు మాత్రం సంవత్సరానికి ఒకసారి మాత్రమే నిర్వహించబడతాయి. దీంతో పాటు, CBSE 12వ బోర్డు పరీక్షలు 2026 వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయని, దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హయ్యర్ సెకండరీ పరీక్షలకు హాజరవుతారని బోర్డు ప్రకటించింది.