- కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఘన విజయం..
- ప్రధానిగా మార్క్ కార్నీ..
- కలిసి పనిచేద్ధామని ప్రధాని మోడీ ట్వీట్..

Canada Elections: కెనడా ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ వరసగా మూడోసారి ఘన విజయం సాధించి, అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు తీసుకోనున్నారు. కెనడా పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో మొత్తం 343 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే 172 మంది సభ్యులు అవసరం. అయితే, లిబరల్ పార్టీ 168 స్థానాలు, కన్జర్వేటివ్ పార్టీ 144 స్థానాలను గెలుచుకున్నాయి. చిన్నాచితకా పార్టీలు కలిసి మిగిలి స్థానాల్లో విజయం సాధించాయి. అధికారానికి కేవలం 4 సీట్ల దూరంలో లిబరల్ పార్టీ ఆగిపోయినప్పటికీ, ఇతరులు మద్దతు ఖచ్చితంగా ఉండటంతో మరోసారి అధికారాన్ని చేపట్టబోతోంది.
నిజానికి, ప్రధానిగా జస్టిన్ ట్రూడో ఉన్న సమయంలో లిబరల్ పార్టీ అధికారంలోకి రాదని అంతా అనుకున్నారు. అయితే, ఆయన ప్రధాని పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికల ముందు మార్క్ కార్నీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కార్నీ నేతృత్వంలో లిబరల్ పార్టీ సత్తా చాటింది.
Read Also: YS Jagan: మీరే సర్వం.. మీరే పార్టీ.. పార్టీయే మీరు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..
ఇదిలా ఉంటే, కెనడా పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించిన మార్క్ కార్నీ, అతని లిబరల్ పార్టీని ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. జస్టిన్ ట్రూడో సమయంలో ఇరు దేశాల మధ్య క్షీణించిన దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన మార్క్ కార్నీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ‘‘భారతదేశం, కెనడా ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, చట్ట పాలన పట్ల దృఢమైన నిబద్ధత, శక్తివంతమైన ప్రజలు-ప్రజల సంబంధాలతో కట్టుబడి ఉన్నాయి. ఇది మన భాగస్వామ్యాన్ని, మన ప్రజల కోసం గొప్ప అవకాశాలను తెరవగలవు’’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో భారత్, కెనడా బంధాలు తీవ్రంగా క్షీణించాయి. ట్రూడో ఖలిస్తానీ ఉగ్రవాదులుకు, ఖలిస్తానీ మద్దతుదారులకు గట్టి మద్దతుదారుగా ఉన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య ఘర్షణ మొదలైంది. ప్రధాని హోదాలో ఉన్న ట్రూడో, నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అయితే, భారత్ వీటిని అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. కెనడా ఉగ్రవాదులకు , గ్యాంగ్ స్టర్లకు స్వర్గధామంగా మారిందని భారత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పలుమార్లు కెనడా నుంచి భారత్ ఆధారాను కోరినప్పటికీ, అప్పటి ట్రూడో ప్రభుత్వం ఎలాంటి సాక్ష్యాలను అందించలేదు.