ఇంటర్నెట్ డెస్క్: కాల్షియం సప్లిమెంట్స్‌తో కిడ్నీల్లో రాళ్లు వస్తాయా అనే సందేహం అనేక మందికి కలుగుతుంటుంది. కొందరు డాక్టర్లను సంప్రదిస్తే మరికొందరు తీవ్ర భయానికి లోనై కనీసం పాలు, పెరుగు తీసుకోవడం కూడా మానేస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి అనేక పోస్టులు చూసి తీవ్రంగా ప్రభావితమవుతుంటారు జనాలు. అయితే, ఈ విషయంలో అనవసర ఆందోళన అవసరం లేదని వైద్యులు భరోసా ఇస్తున్నారు (Calcium Supplements – Kidney Stones).
వైద్యులు చెప్పేదాని ప్రకారం, కేవలం కాల్షియం సప్లిమెంట్స్‌తో కిడ్నీల్లో రాళ్లు రావు. సాధారణంగా శరీరానికి తగినంత కాల్షియం అందని సందర్భాల్లో ఎముకల్లోని కాల్షియంపై ఆధార పడాల్సి వస్తుంది. దీంతో, రక్తంలో కాల్షియం స్థాయిల నిర్వహణ కోసం ఎముకల్లోని కాల్షియం క్రమంగా కరిగిపోతుంది. మూత్రం ద్వారా ఈ కాల్షియం విసర్జితమవుతుంది. కొన్ని సందర్భాల్లో గడ్డకట్టి రాళ్లలా మారుతుంది.
Coconut water High Potassium: కొబ్బరి నీళ్లతో ఇలాంటి రిస్కులు కూడా ఉంటాయి జాగ్రత్త!
భారతీయుల్లో కిడ్నీ రాళ్ల వ్యాధి ఎక్కువగా కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. మొత్తం జనాభాలో దాదాపు 12 శాతం మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారు. కొందరికి జన్యు కారణాల రీత్యా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇతరత్రా కారణాలు కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేలా చేస్తున్నాయి. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం, పానీయాలు తక్కువగా తీసుకోవడం, ఆహారంలో ఆక్సాలేట్స్, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వంటివన్నీ కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ముప్పును పెంచుతున్నాయి.
కిడ్నీల్లో ఏర్పడే రాళ్లల్లో అధిక శాతం కాల్షియం ఆధారితైనవే. అంటే.. ఇవి కాల్షియం ఆక్సాలేట్, కాల్షియం ఫాస్ఫేట్, యూరిక్ యాసిడ్‌తో పాటు ఇతర రసాయనాలతో ఏర్పడతాయి. దీంతో, కాల్షియం తీసుకోవడాన్ని తగ్గిస్తే ఈ ముప్పు తప్పుతుందని కొందరు భావిస్తుంటారు. అయితే, ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉంటే కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశం తగ్గుతున్న విషయాన్ని ఇప్పటికే అధ్యయనాల్లో రుజువైందని వైద్యులు చెబుతున్నారు. ఆహారంలో ఉన్న కాల్షియం, పేగుల్లోని ఆక్సాలేట్‌తో బలంగా అనుసంధానం అవుతుందట. ఫలితంగా ఆక్సాలేట్‌ను శరీరం గ్రహించలేదు. దీంతో, శరీరంలో ఈ రసాయనం స్థాయిలు తగ్గి కిడ్నీల్లో రాళ్ల సమస్య ప్రమాదం కూడా తగ్గుతుంది.
Coffee Dehydration: ఒక కప్పు కాఫీ తాగితే రెండు బాటిల్స్ నీళ్లు తప్పనిసరిగా తాగాలా.. ఈ రూల్ వెనక కారణం ఏంటంటే..
అయితే, ఆహారంతో నిమత్తం లేకుండా కాల్షియం తీసుకుంటే మాత్రం శరీరం రెండిటినీ గ్రహిస్తుంది. మూత్రంలో వీటి శాతం పెరుగుతుంది. అంతిమంగా ఇవి కిడ్నీల్లో కాల్షియం ఆక్సాలేట్ రాళ్లుగా మారి సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి కాల్షియం సప్లిమెంట్స్‌ను ఆహారంతో పాటు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అయితే, కిడ్నీల్లో రాళ్లకు ప్రధాన కారణం డీహైడ్రేషన్ అని కూడా వైద్యులు చెబుతున్నారు. శరీరంలో తగినంత నీరు లేనప్పుడు కిడ్నీల్లోని కాల్షియం, ఇతర ఖనిజాలు గడ్డకట్టి రాళ్లగా మారే అవకాశం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలిన అంటున్నారు.
Read Latest and Health News