చార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలకు సంబంధించి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కీలక ప్రకటన చేసింది. ఇకపై ఏడాదికి మూడు సార్లు సీఏ వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. 2025 నుంచే సీఏ ఫైనల్ పరీక్షల్ని ఏడాదికి మూడుసార్లు నిర్వహించనున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు ICAI గురువారం (మార్చి 27) ప్రకటించింది.
ఇప్పటి వరకూ సీఏ ఫైనల్ పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఐసీఏఐ గతేడాది మార్చిలోనే సీఏ ఇంటర్, ఫౌండేషన్ కోర్సు పరీక్షలను ఏడాదికి మూడుసార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా సీఐ ఫైనల్ పరీక్షలను సైతం అదే తరహాలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులకనుగుణంగా విద్యార్థులకు గొప్ప అవకాశాలను అందించేందుకు సీఏ ఫైనల్ పరీక్షల్ని సైతం ఏడాదికి మూడుసార్లు నిర్వహించేలా చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు ICAI తెలిపింది.
తాజా నిర్ణయంతో సీఏ ఫైనల్, ఇంటర్, ఫౌండేషన్ పరీక్షలు ఏడాదిలో మూడుసార్లు జరుగుతాయని పేర్కొంది. దీనివల్ల విద్యార్థులు పరీక్ష రాయడానికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ఈ పరీక్షలు జనవరి, మే, సెప్టెంబర్ నెలల్లో జరుగుతాయని స్పష్టం చేసింది. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్‌లో పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్సు కూడా పరివర్తన చెందుతుందని ICAI తెలిపింది. కాగా ఇప్పటి వరకూ ఈ పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తూ వచ్చింది. ప్రతీయేటా జూన్, డిసెంబర్‌లలో రెండుసార్లు నిర్వహించే ఈ కోర్సు అసెస్‌మెంట్ టెస్ట్ ఈ 2025-26 విద్యా సంవత్సరం నుంచి మూడుసార్లు జరుగుతాయి. తద్వారా ఎంతో కఠినమైన సీఏ పరీక్షలను విద్యార్ధులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయొచ్చు. అంతేకాకుండా బ్యాక్ లాగ్‌లు ఉన్న విద్యార్ధులు సకాలంలో సబ్జెక్టులు క్లియర్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.