BRS MLA Harish Rao: భూములు హెచ్‌సీయూవే

Written by RAJU

Published on:

  • 2012 నాటి ఆర్డీవో నివేదిక అదే చెబుతోంది.. కంచగచ్చిబౌలిలో పర్యావరణ విధ్వంసం

  • సుబాబులే కాదు.. ఔషధ మొక్కలున్నాయి

  • 3 జింకల చావుకు రేవంతే కారణం

  • సల్మాన్‌లా ఈయన్నూ శిక్షించాలి: హరీశ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం కంచగచ్చిబౌలి భూముల్లో పర్యావరణ విధ్వంసం సృష్టించిందని, వేల చెట్లునరికి వన్యప్రాణి చట్టాన్ని, వాల్టా చట్టాన్ని ఉల్లంఘించిందని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారు. సుప్రీంకోర్టు పరిధిలోని కేంద్ర సాధికార కమిటీ కంచె గచ్చిబౌలి భూముల సందర్శనకు రాగా, హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ నేతలు వారిని కలిసి తమ వాదన వినిపించారు. అనంతరం హరీశ్‌రావు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హెచ్‌సీయూ విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ వేత్తలు లేవనెత్తుతున్న అంశాలపై 11 పేజీల వాస్తవ నివేదికను, 200 పేజీల అనుబంధ పత్రాలను వారికి అందజేశామని చెప్పారు. కంచ గచ్చిబౌలి భూములమ్మి ఖజానాకు రూ.40 వేల కోట్లు తెచ్చేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. చెట్లునరికి వన్యప్రాణుల గూడు చెదర గొట్టారని, అధికారుల నిర్లక్ష్యం వల్ల మూడు జింకలు చనిపోయాయన్నారు. అటవీ శాఖ అనుమతి ఉంటే తప్ప చెట్లను నరక కూడదన్న నిబంధన ఉన్నప్పటికీ ఇంతలా పర్యావరణ విధ్వంసం జరిగితే అటవీ అధికారులు నిద్ర పోతున్నారా? అని ప్రశ్నించారు. సుబాబుల్‌ చెట్లు మాత్రమే ఉన్నాయని అటవీ అధికారులు అబద్ధ్దం చెబుతున్నారని, సుగంధ పరిమళాలిచ్చే చెట్లు, అనేక ఔషధ మొక్కలు కూడా ఉన్నాయని చెప్పారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రకృతి విధ్వంసంతో రేవంత్‌రెడ్డి ఏడు చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించారు. సుప్రీం ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఈ భూములు టీజీఐఐసీ పరిధిలోనివని బుధవారం బోర్డులు ఏర్పాటు చేశారని అన్నారు.

సీఎంకో న్యాయం… పేదోడికో న్యాయమా?

పేద రైతు పొలంలో చింత చెట్టు, యాప చెట్టు కొట్టుకుంటే పోలీసులు, ఎమ్మార్వో లక్షల్లో జరిమానా వేస్తారని, కంచగచ్చిబౌలిలో వేలచెట్లు నరుకుతుంటే ఫారెస్ట్‌, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని హరీశ్‌ ప్రశ్నించారు. వాల్టా చట్టం కింద ముందు దరఖాస్తు చేసి, ఒక చెట్టు కొట్టేస్తే, బదులు రెండు చెట్లు పెట్టాలని చెప్పారు. కంచగచ్చిబౌలి భూముల్లో 2011లో లక్షల మొక్కలు పెట్టారని, మన్మోహన్‌సింగ్‌ కూడా అక్కడ మొక్కలు నాటారని ప్రస్తావించారు. ఒక జింకను చంపిన సల్మాన్‌ఖాన్‌ను జైల్లో పెట్టారని, మూడు జింకల చావుకు కారణమైన రేవంత్‌రెడ్డికి కూడా కఠినశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. కంచ గచ్చిబౌలి భూములు హెచ్‌సీయూ ఆధీనంలోనే ఉన్నాయని 2012లో సంబంధిత ఆర్డీఓ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారని ప్రస్తావించారు. 400 ఎకరాలకు బదులుగా హెచ్‌సీయూకి ఇచ్చిన భూములను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకున్నందున ఈ భూములు హెచ్‌సీయూవే అవుతాయని చెప్పారు. చెట్లు కొట్టడానికి రక్షణ కోసం పోలీసు స్టేషన్‌లో టీజీఐఐసీ దరఖాస్తు చేసిందని, అసలు దరఖాస్తే నేరపూరితమని వ్యాఖ్యానించారు. చెట్లు నరకడానికి అటవీ శాఖ అనుమతి, వాల్టా అనుమతి ఉందా? అని అడిగిన తర్వాతే పోలీసులు రక్షణ కల్పించాల్సిందని అన్నారు. తమ ప్రభుత్వం ఉన్నపుడు సచివాలయం నిర్మించే క్రమంలో చెట్లు నరకొద్దని రేవంత్‌ సుప్రీంకోర్టుకు వెళ్లారని ప్రస్తావించారు. అక్కడ నరికింది20 చెట్లని వాటికి కూడా అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పారు. రేవంత్‌ సర్కారు 4 నెలల క్రితం కంచగచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి పది వేల కోట్లను అప్పుగా తీసుకుందని హరీశ్‌ తెలిపారు. అప్పు ఇప్పించిన బ్రోకర్‌కు ఫీజు కింద దాదాపు 170 కోట్లు చెల్లించారని చెప్పారు. అదే బ్రోకర్‌ ద్వారా హెచ్‌ఎండీఏ భూములను తాకట్టు పెట్టి మరో 20 వేల కోట్ల అప్పు చేసేందుకు ప్రణాళికలు వేస్తోందన్నారు. అప్పుడెంత బ్రోకర్‌ ఫీజు చెల్లిస్తారో చూడాలని అన్నారు. ప్రభుత్వ గ్యారెంటీతో చేసే అప్పులకూ బ్రోకర్‌ను ఆశ్రయించడం కాంగ్రెస్‌కి చెల్లిందని వ్యాఖ్యానించారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights