తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల జాతరకు ముహర్తం ఫిక్స్ అయింది. ఆషాడ మాసంలో జరుపుకునే బోనాల పండగను తెలంగాణ ప్రభుత్వం ఏటా ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో చారిత్రక గోల్కొండ బోనాలతో పాటు పాతబస్తీ లాల్‌దర్వాజా బోనాలు, సికింద్రాబాద్ బోనాల తేదీలను ప్రకటించింది. జూన్ నెలలో బోనాల సంబరాలు మొదలు కానున్నాయి.
2025 సంవత్సరానికి సంబంధించి ఆషాడం బోనాల షెడ్యూల్
తెలంగాణ ప్రజలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే పండుగల్లో బోనాలు ఒకటి. రాష్ట్ర పండుగ అయిన బోనాల పండుగను జరుపుకునే తేదీలను ప్రభుత్వం ఈ ఏడాది అధికారికంగా ప్రకటించింది. తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత ఆషాఢ మాసం మొదలవుతుంది. ఈ ఆషాఢ మాసంలోని మొదటి గురువారం లేదా తొలి ఆదివారం రోజున గోల్కొండలోని జగదాంబిక దేవాలయంలో బోనాల సంబురాలకు శ్రీకారం చుడతారు. బంగారు బోనంతో సంబురాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది బోనాలు జూన్ 26వ తేదీన ప్రారంభమై జూలై 24వ తేదీతో ముగుస్తాయి. జూన్ 26వ తేదీ గురువారం చారిత్రక గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించడంతో బోనాలు సంబురాలు మొదలవుతాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జూలై 13న జరపనుండగా.. పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు జూలై 20న జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి
గతేడాది గోల్కొండ బోనాలలో 25 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. అయితే ఈ ఏడాది బోనాల సంబంరాల్లో పాల్గొనే భక్తుల సంఖ్య మరింత ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను కల్పించాలని భావిస్తున్నారు.
జూన్ 26వ తేదీ గురువారం మొదటి బోనం .. జూన్ 29వ తేదీ ఆదివారం రెండవ బోనం, జూలై 3వ తేదీ గురువారం మూడవ బోనం, జూలై 6వ తేదీ ఆదివారం నాల్గవ బోనం, జూలై 10వ తేదీ గురువారం ఐదవ బోనం, జూలై 13వ తేదీ ఆదివారం ఆరవ బోనం, జూలై 17వ తేదీ గురువారం ఏడవ బోనం, జూలై 20వ తేదీ ఆదివారం 8వ బోనం, జూలై 24వ తేదీ గురువారం 9వ బోనం నిర్వహించనున్నారు.
తెలంగాణ సంప్రదాయానికి చిహ్నంగా జరుపుకునే బోనాన్ని మహిళలే స్వయంగా తయారు చేస్తారు. అన్నం, పాలు, పెరుగుతో తయారు చేసిన బోనాన్ని మట్టి కుండలో పెట్టి గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మలకు పసుపు కుంకుమలు, చీరసారెలతో సమర్పిస్తారు. తమకు ఎటువంటి ఆపద రాకుండా చూడమంటూ అమ్మవారిని కోరుకుంటారు. ఈ బోనాలు తెలంగాణ తో పాటు ఆంధ్రాలోని రాయలసీమ, కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ జరుపుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..