- రసాభాసగా తమిళనాడు బడ్జెట్ సమావేశాలు..
- బీజేపీ, అన్నాడీఎంకే వాకౌట్..
- రూపాయి సింబల్, మద్యం కుంభకోణంపై విపక్షాలు ఫైర్..

Tamil Nadu assembly: ‘‘హిందీ వివాదం’’, ‘‘డీలిమిటేషన్’’, ‘‘రూపాయి సింబర్ మార్పు’’ వివాదాల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, సమావేశాల జరుగుతున్న సమయంలో సభ నుంచి బీజేపీ, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. డీఎంకే ప్రభుత్వ రూపాయి చిహ్నాన్ని మార్చడం, తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టాస్మాక్)లో అవినీతిని ఆరోపిస్తూ రెండు పార్టీల ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ.. బడ్జెట్‌ని ‘‘కంటితుడుపు’’ చర్యగా విమర్శించారు. ‘‘మేము బడ్జెట్ నుంచి వాకౌట్ చేశాము. ఈ రోజు టస్మాక్ పెద్ద సమస్య. డీఎంకే ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకిగా మారిందో ఇది చూపిస్తుంది. వారు టస్మాక్ నుంచి రూ. 50,000 కోట్లు సంపాదిస్తున్నారు. కానీ రాష్ట్ర అప్పు రూ. 9 లక్షల కోట్లకు పైగా ఉంది. ఈ బడ్జెట్ సరిగా లేదు’’ అని అన్నారు. డీలిమిటేషన్ అంశాన్ని డీఎంకే అనవసరంగా వివాదాస్పదం చేస్తోందని అన్నామలై అన్నారు.
Read Also: Donald Trump: నార్త్ కొరియా కిమ్‌తో నాకు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయి
బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ నిరసనగా నల్ల చీర ధరించి సెషన్‌కు హాజరయ్యారు. ఈ ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోయిందని, మా కోర్సుల్లో తమిళం ఉపయోగించాన్ని మేము స్వాగతిస్తున్నామని, కానీ తమిళం, సంస్కృతి పేరుతో, వారు దేశ చిహ్నానికి వ్యతిరేకంగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని ఆమె అన్నారు. రూపాయి చిహ్నంపై డీఎంకే వైఖరిని ఆమె ప్రశ్నించారు. మాజీ సీఎం కరుణానిధి కూడా ఈ సింబల్‌ని రూపొందించిన ఉదయ్ కుమార్‌ని అభినందించిన విషయాన్ని గుర్తు చేశారు. మీరు ఎందుకు మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారని స్టాలిన్‌ని ప్రశ్నించారు. మరోవైపు, టస్మాస్ మద్యం కుంభకోణం నేపథ్యంలో సీఎం స్టాలిన్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత పళని స్వామి డిమాండ్ చేశారు.