Bitter Gourd : కాకరకాయ అంటే.. వామ్మె.. ఆ కర్రీ నా.. అస్సలు వద్దు అని చాలా మంది అంటారు. అంత చేదు తినడం మా వల్ల కాదని అంటుంటారు. కాకరకాయ కర్రీని తినేందుకు చాలా మంది విసుక్కుంటారు. కానీ, ఇందులోని చేదు ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో తెలుసుకోలేరు. కాకరకాయ చేదు రుచి ఉన్నప్పటికీ వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం కొంతమంది ఎక్కువగా వాడుతుంటారు. కాకరకాయ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇన్సులిన్ సమ్మేళనాలు..
కాకరకాయలో పాలీపెప్టైడ్-పి అనే ఇన్సులిన్ లాంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి, మధుమేహం ఉన్నవారు కాకరకాయ తింటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఫైబర్ కంటెంట్..
ఇందులో అదనంగా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కాకరకాయ గొప్పగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ క్రమం తప్పకుండా పేగు కదలికలను ప్రోత్సహించడం మాత్రమే కాకుండా మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.
విటమిన్లు, ఖనిజాలు..
కాకరకాయలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మన శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది. పొటాషియం, ఐరన్ వంటి ఇతర ముఖ్యమైన ఖనిజాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తికి ఎక్కువగా ఉపయోగపడతాయి.
గుండె ఆరోగ్యానికి..
కాకరకాయలో పొటాషియం, మెగ్నీషియం వంటి సమ్మేళనాలు అధికంగా ఉన్నాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి అవసరం. ఈ ఖనిజాలు రక్తపోటును నియంత్రించడంలో ఎక్కువగా సహాయపడతాయి. గుండె సమస్యలు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
బరువు తగ్గేందుకు..
కాకరకాయలో తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారికి కాకరకాయ ఎంతో మేలు అని నిపుణులు చెబుతున్నారు.
(Note:పై సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN దీనిని ధృవీకరించ లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి.)