Bhupesh Baghel CBI Raid: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపేశ్ బాఘేల్ నివాసానికి సీబీఐ బృందం బుధవారం చేరుకుని దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు కోసం సీబీఐ బృందం రాయ్‌పూర్, భిలాయ్‌లకు చేరుకున్నట్లు చెబుతున్నారు. అంతకుముందు, ED బృందం భూపేశ్ బాఘేల్ నివాసంపై దాడి చేసింది. సీబీఐ బృందాలు రాయ్‌పూర్, భిలాయ్‌లోని బాఘేల్ నివాసంతో పాటు ఒక సీనియర్ పోలీసు అధికారి, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడి నివాస ప్రాంగణంలో దాడులు చేశాయి. ఇంటి లోపల సీబీఐ బృందం దర్యాప్తు చేస్తుండగా, ఇంటి బయట పోలీసు బలగాలను మోహరించారు.
అయితే తాజా సోదాలపై అధికారులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. మద్యంకుంభకోణానికి సంబంధించిన కేసులో ఈ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఇదే కేసుకు సంబంధించి బఘేల్, ఆయన కుమారుడు చైతన్య నివాసంలో ఈడీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ సోదాల సందర్భంగా రూ. 30లక్షల నగదు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆ తనిఖీల తర్వాత తిరిగి వెళ్తున్న ఈడీ అధికారుల వాహనాలపై నిరసనకారులు రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.