ABN
, Publish Date – Mar 23 , 2025 | 04:29 AM
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘రాజీవ్ యువ వికాసం’ పథకంలో మధ్య దళారుల ప్రమేయం ఉండొద్దని, ఈ విషయంలో అధికారులు ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు.

హైదరాబాద్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘రాజీవ్ యువ వికాసం’ పథకంలో మధ్య దళారుల ప్రమేయం ఉండొద్దని, ఈ విషయంలో అధికారులు ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. యువత జీవితాల్లో మార్పును తీసుకురావడానికి అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి రాజీవ్ యువ వికాసం పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 59 వేలకుపైగా ఉద్యోగ నియామక పత్రాలను అందించామని, ఉద్యోగాలు రాని యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ పథకం అమలు విషయంలో అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. పథకాన్ని ప్రారంభించడానికి ముందే.. నిధులను సమీకరించుకున్నామని, ఈ దృష్ట్యా నిధుల కొరత అన్న సమస్య ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. బ్యాంకు రుణాలతో కలుపుకొని ప్రభుత్వం రూ.9 వేల కోట్ల వరకు ఈ పథకం కోసం పెట్టుబడి పెడుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖలను సమన్వయం చేస్తూ.. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ‘రాజీవ్ యువ వికాస్ మిషన్’ను ఏర్పాటు చేస్తున్నామని, ఈ మిషన్ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారికి అప్పగిస్తామని చెప్పారు. శాఖల వారీగా ఈ పథకాన్ని పర్యవేక్షించడానికి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా నియమించుకోవాలని చెప్పారు. పథకానికి సంబంధించి ఏప్రిల్ 5లోగా దరఖాస్తుల స్వీకరణను పూర్తిచేసి, జూన్ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు పథకం పత్రాలను అందజేస్తామన్నారు. యూనిట్లు పొందిన యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నారు.
Updated Date – Mar 23 , 2025 | 04:29 AM